ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాక.. వారి సమస్యలను స్వయంగా తెలుసుకోవడం కోసం టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పాదయాత్ర షెడ్యుల్‌లో మార్పుల చేశారు. కారణం ఏంటంటే..
మన దేశ రాజకీయాల్లో పాదయాత్ర అంటే ఎంత శక్తివంతమైన అస్త్రమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేడు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలు.. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ వరకు పలువురు శక్తివంతమైన నేతలు సుదీర్ఘ పాదయాత్రలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక తెలుగుదేశం కీలక నేత నారా లోకేష్ సైతం ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. పార్టీని బలోపేతం చేయడమే కాక.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించింన సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు.. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కిలోమీటర మేర పాదయాత్ర చేపట్టున్నారు లోకేష్. యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వస్తోంది. అయితే లోకేష్ పాదయాత్రకు సంబంధించి తాజాగా కొన్ని మార్పులు చేశారు. ఆ వివరాలు..
నేటి నుంచి అనగా ఏప్రిల్ 11 నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర.. ఉదయం 7 గంటలకు ప్రారంభమై.. 11 గంటలకు ముగుస్తుంది. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకి మొదలవుతుంది. తిరిగి పాదయాత్ర 4 గంటలకు మొదలవుతుంది. అయితే పాదయాత్ర షెడ్యుల్‌లో మార్పులకు కారణం.. మండుతున్న ఎండలు. ఏప్రిల్ నెలలోనే రాష్ట్రం విపరీతంగా వేడెక్కుతోంది. భానుడి ప్రతాపం పెరిగిపోతుంది. గత రెండు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. మరి కొన్ని రోజుల పాటు సాధారణం కంటే.. ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. పాదయాత్ర సజావుగా సాగేటట్లు రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు. వేలాదిమంది అభిమానులతో సాగుతున్న లోకేష్ పాదయాత్రను విచ్చిన్నం చేయాలని కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయంటూ వర్ల రామయ్య లేఖలో ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఉవ్వెత్తున సాగుతున్న పాదయాత్ర చూసి కొంతమంది వైఎస్సార్సీపీ పెద్దలకు కన్ను కుట్టింది అంటూ విమర్శలు చేశారు. దానిలో భాగంగా లోకేష్ పాదయాత్ర..తన సామ్రాజ్యంలో అడుగుపెడితే పాదయాత్రను భగ్నం చేస్తానని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బీరాలు పలుకుతున్నారంటూ వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.
డీజీపీ వెంటనే తాడిపత్రి ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకొని.. నారా లోకేష్ పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేలా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అలానే తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఎట్టిపరిస్ధితుల్లోనూ తాడిపత్రిలో లోకేష్ పాదయాత్ర సాగనివ్వను అంటూ ఎమ్మెల్యేకు హామీ ఇవ్వటం పోలీస్ అధికారిగా దుర్మార్గపు చర్య, తగని పని అన్నారు. లోకేష్ పాదయాత్రకు ఏ ఆటంకం జరిగినా ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు శాఖ పూర్తి బాధ్యత వహించాలన్నారు. మరి వర్ల రామయ్య కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.