మనిషి ఆశావాది. భూమి మీద కాకుండా మానవులు జీవించగలిగే గ్రహం ఏదన్నా ఉందన్న కోణంలో అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. మనిషి మనుగడకు నీరు ముఖ్యం కాబట్టి అది ఏ గ్రహంపై ఉందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
మనిషి ఆశావాది. భూమి మీద కాకుండా మానవులు జీవించగలిగే గ్రహం ఏదన్నా ఉందన్న కోణంలో అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. మనిషి మనుగడకు నీరు ముఖ్యం కాబట్టి అది ఏ గ్రహంపై ఉందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అందులో భాగంగా చంద్రుడిపై ప్రయోగాలు చేస్తున్నారు. చంద్రునిలో రహస్యాలు చేధించేందుకు, నీటి జాడలు కనుగొనేందుకు భారత్ చంద్రయాన్ పేరిట ప్రయోగాన్ని చేపడుతుంది. ఇప్పటి వరకు చంద్రయాన్-1, చంద్రయాన్-2 ప్రయోగాలు అయ్యాయి. చంద్రయాన్-2 మిషన్ ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు చంద్రయాన్-3కి రంగం సిద్దం చేసింది. జులై 14వ తేదీన చంద్రయాన్-3ని భారతీయ అంతరిక్ష కేంద్రం (ఇస్రో )ప్రయోగించనుంది.
ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం నుండి రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నారు శాస్త్రవేత్తలు. దీనికి సర్వం సిద్ధం చేసింది ఇస్రో. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ చంద్రయాన్-3 ప్రయోగం.. రేపు మధ్యాహ్నం 2.35 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ వినీలాకాశంలోకి దూసుకెళ్లనుంది. ఇందులో కూడా ల్యాండర్, రోవర్ ఉండనున్నాయి. చంద్రయాన్-2 ఫెయిల్యూర్ నుండి పాఠాలు నేర్చుకున్న ఇస్రో, ఈ సారి చంద్రుడిపై రోవర్ దిగేలా లక్ష్యం పెట్టుకుంది. చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై ఫోకస్ పెట్టింది. ఎందుకంటే.. గతంలో నీటి జాడలు ఉన్నట్లు నాసా కూడా ఇటీవల గుర్తించింది. ఇక్కడ చాలా కాలం పాటు వెలుతురు లేకపోవడంతో నీరు మంచు స్ఫటికలా మారి ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందువల్ల దక్షిణ ధ్రువంపై ప్రయోగాన్ని చేపడుతున్నారు.
ఈ ప్రయోగానికి అన్ని సన్నాహాలు చేసిన శాస్త్రవేత్తలు.. ఈ ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా శాస్త్రవేత్తలను కూడా వారి నమ్మకాల నుండి వేరు చేయలేమని మరోసారి రుజువు చేసినట్లు అవుతుంది. అయితే శాస్త్రాన్ని మించిన శక్తి ఉందని నమ్ముతుంటారు. ఇందులో భాగంగా ఆనవాయితీ ప్రకారం ప్రతి ప్రయోగానికి ముందు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శిస్తుంటూంది ఇస్రో బృందం. గురువార కూడా మిషన్ నమూనాను తీసుకెళ్లిన ఎనిమిది మంది శాస్త్రవేత్తలతో కూడిన బృందం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసింది. అలాగే ఈ రాకెట్ ప్రయోగానికి ముందు కూడా ఓ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తుంది. అదే తిరుపతి జిల్లాలోని సూళ్లూరు పేటలోని చెంగాళమ్మ ఆలయం. దశాబ్దాల కాలం నుండి కొనసాగుతున్న ఈ ఆచారాన్ని అనుసరిస్తున్నారు శాస్త్రవేత్తలు.
చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే.. రాకెట్ ప్రయోగాన్ని చేపడుతుంటారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల ఇస్రో చేపట్టిన PSLC-C55 రాకెట్ ప్రయోగానికి కూడా ముందు కూడా సోమనాథ్ చెంగాళమ్మ ఆలయాన్ని సందర్శించిన సంగతి విదితమే. ఇంతకు ఈ ఆలయాన్ని సందర్శించడం వెనుక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఈ చెంగాళమ్మ గుడి తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన సూళ్లూరు పేటలో ఉంది. కాళంగి నది ఒడ్డున ఉన్న ఈ గుడికి ఎన్నో వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇక్కడ మనరాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు ప్రాంత వాసులు కూడా వచ్చి సందర్శిస్తుంటారు. పదో శతాబ్ద కాలంలో పశువులను మేతకు తీసుకెళ్లిన యువకులు .. కాళంగి నదిలో ఈతకు దిగి, నీటి ప్రవాహం ధాటికి కొట్టుకుపోతూ ఓ శిలను పట్టుకుని ప్రాణాలతో భయపడ్డారట. నీటి ఉదృతి తగ్గిన తర్వాత చూస్తే అష్ట భుజాలతో వివిధ ఆయుధాలతో ఉన్న దేవీ విగ్రహాన్ని చూసిన కాపరులు.. గ్రామస్థులకు విన్నవించగా.. అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకు వచ్చి ఒక రావి చెట్టు క్రింద తూర్పుముఖంగా పడుకోబెట్టారు.
మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖముగా నిటారుగా నిలబడి మహిసాసుర మర్ధిని రూపంలో వెలసి ఉండటాన్ని చూసి గ్రామస్థులు పూజలు చేయడం ఆరంభించారు. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల క్రితం ఒక దొంగ ఆలయంలోకి చోరీ చేయడానికి వచ్చి భంగపడ్డాడట. దీంతో ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారట. అయితే అమ్మవారు కలలో కనిపించి నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండకూడదు అని చెప్పడంతో ఆ తలుపులను తొలగించి ప్రాంగణంలో ఓ చోట ఉంచారట. చెక్కిన చెక్కనుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగింది. ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమని భావిస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే దేవతగా ఆమెకు పేరు ఉండటంతో ఇస్రో శాస్త్రవేత్తలు కూడా తమ ప్రయోగం విజయవంతం కావాలని పూజిస్తుంటారు.