టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఉన్న ఆయన కొంత కాలంగా మంచానికే పరిమితం అయ్యారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో వారం క్రితం అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయినట్లుగా వైద్యులు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉండటమే కాక.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు బొజ్జల ఎంతో ఆత్మీయుడు. ఈ క్రమంలో చంద్రబాబు స్నేహితుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొనడమే కాక.. చంద్రబాబు స్వయంగా బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి పాడె మోశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Ayyanna Patrudu: చంద్రబాబు మీటింగ్ లో జై జగన్ నినాదాలు! ఇందులో నిజమెంత?
బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు మిత్రుడు. చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్లు జరిపిన దాడిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా గాయపడ్డారు. ఆ గాయాలకు ఆయన చాలా కాలం పాటు చికిత్స తీసుకున్నారు. పలు ఆపరేషన్లు కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఇక రాజకీయాల్లో బొజ్జల ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన ఆ తర్వాత శ్రీకాళహస్తి ప్రజల ఆదరాభిమానాలు పొందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి మంత్రి వర్గంలో ఆయన ఆటవి శాఖ మంత్రిగా పని చేశారు. అయితే, అనారోగ్యం కారణంగా చివరిలో ఆయనకు విశ్రాంతినిచ్చారు చంద్రబాబు. గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి బొజ్జలకు బదులుగా ఆయన తనయుడు సుధీర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇది కూడా చదవండి: అలా అయితే.. TDP ప్రతిపక్షంలోనే ఉండిపోతుంది: చంద్రబాబు!
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశంలో ఉన్న సమయంలో ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్, మండవ వెంకటేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆత్మీయ మిత్రులుగా ఉండేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా పలు సందర్భాలలో కేసీఆర్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మధ్య ఆత్మీయ సమావేశాలు జరిగాయి. బొజ్జల అనారోగ్యంతో ఉన్నారని తెలిసిన తర్వాత కేసీఆర్ కూడా హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: చంద్రబాబు జోలికి వస్తే.. చంపడానికైనా.. చావడానికైనా సిద్ధం: బుద్ధా వెంకన్న