ఏపీలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార పక్ష నేతలు.. తాము చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి చెబుతుంటే.. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని రకాల వ్యూహాలతో అధికార, ప్రతిపక్ష నేతలు ముందుకు సాగుతున్నారు. అధికార పక్షం ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది పనుల గురించి గడప గడపకు అనే ప్రోగ్రామ్ తో వెళ్తుంటే.. ప్రతిపక్ష పార్టీ నేతలు పాదయాత్ర, ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల పడిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గంలో వైసీపీ మహిళా కార్యకర్త ప్రభావతి.. చంద్రబాబు నాయుడు వద్ద తన బాధను చెప్పుకుంది. వడగండ్ల వర్షం వల్ల ధాన్యం పూర్తిగా తడిచిపోయిందని.. తాము రోడ్డున పడ్డామని.. తమను ఆదుకునే వారు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని.. ఇతర రాష్ట్రాల్లో చదువుతున్నారని.. వారి చదువుకు డబ్బు లేకుండా పోయిందని కన్నీరు పెట్టుకుంది.
ధాన్యం అమ్మిన డబ్బుతో తన పెద్ద కూతురు పరీక్ష ఫిజు కట్టాల్సి ఉండగా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేసింది. తాను పక్కా వైసీపీ కార్యకర్తనని.. కానీ ఇప్పుడు పంట నష్టపోతే పార్టీ నాయకులు కనీసం వచ్చి చూడలేదని కన్నీరు పెట్టుకుంది. ఫీజు కట్టకపోతే తన కూతురు పరీక్ష రాయడం ఆగిపోతుందని కన్నీరు మున్నీరైంది. దీంతో ప్రభావతి పరిస్థితి చూసి చంద్రబాబు చలించిపోయారు. మీరు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు.. మీ అమ్మాయి ఫీజు ఎంతమ్మా అని అడిగారు. రూ.2.3 లక్షలు అని చెప్పడంతో వెంటనే ఆమెకు నగదు అందించి.. మీ పిల్లలను బాగా చదువుకొని అభివృద్దిలోకి రావాలని కోరుకుంటున్నా అన్నారు చంద్రబాబు. దీంతో ప్రభావతి ఆనందంతో కంటనీరు పెట్టుకున్నారు. కష్టకాలంలో ఉన్న తమ బాధలను అర్ధం చేసుకొని తన కూతురు జీవితం నిలబెట్టారని.. తన జీవితం మొత్తం తేతేపాలోనే ఉంటానని ప్రభావతి తెలిపారు.