రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలను తట్టుకోలేక ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. సూర్యుడి ప్రతాపానికి ఒక సెల్ టవర్ కూడా కాలిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఒక రేంజ్లో మండిపోతున్నాయి. భానుడి భగభగలను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. వడగాలుల తీవ్రత రోజురోజుకీ ఎక్కువవుతోంది. సూర్యుడి ప్రతాపంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని చోట్లా పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైగానే ఉందని తెలిపింది. ఉష్ణోగ్రతల తీవ్రత ఇంతగా పెరగడానికి వాయువ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలులే కారణమని వాతావరణ విభాగం పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.
ముఖ్యంగా వృద్ధులు, పిల్లల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఇదిలా ఉండగా.. ఎండల ధాటికి ఒక సెల్ టవర్ పేలిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఎండల ధాటికి విజయవాడ, గీతా నగర్ ఐడీఎఫ్సీ బ్యాంకు మీద ఉన్న సెల్ టవర్ ఉన్నట్లుండి కాలిపోయింది. టవర్ నుంచి మంటలు చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. టవర్ నుంచి వెలువడిన పొగ దట్టంగా కమ్మేసింది. దీంతో బ్యాంకు సిబ్బందితో పాటు స్థానికులు భయంతో పరుగులు తీశారు. సెల్ టవర్ కాలిపోయిందన్న విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వాళ్లు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. విజయవాడలో అధికమవుతున్న వడగాలుల వల్ల పెరిగిన వేడికి మొబైల్ టవర్ మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.