ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎంత వేడెక్కుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికార- ప్రతిపక్ష పార్టీలు విమర్శలు- ప్రతి విమర్శలతో చెలరేగిపోతున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా వాతావరణం మాత్రం నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి అనేలా ఉంది. వైసీపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు తెర లేపిన విషయం తెలిసిందే. రోడ్లపై సభలు, ప్రసంగాలు, రోడ్ షోలు నిర్వహించేందుకు వీలు లేదంటూ జీవో నంబర్ 1ని తీసుకొచ్చారు.
ఏ రాజకీయ పార్టీ కూడా రోడ్లలపై సభలు, రోడ్ షోలు నిర్వహించరాదని.. మైదానాలలో కావాలంటే సభలు పెట్టుకోవచ్చంటూ చెప్పుకొచ్చారు. ముందస్తు అనుమతి కోరితే అక్కడి పరిస్థితులకు తగ్గట్లు అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. తాము ప్రజల వద్దకు ఎలా వెళ్తామంటూ ప్రశ్నిస్తున్నాయి. అయితే అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్న వేళ సీఎం జగన్ కు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మద్దతుగా నిలిచారు.
జీవో నంబర్ 1ని తీసుకురావడం మంచి విషయమన్నారు. రోడ్లపై సభలు, రోడ్ షోలను నియంత్రించడం స్వాగతించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవో నంబర్ 1పై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఆటంకం కలిగించకుండా రోడ్లపై సభలు, రోడ్ షోలను రద్దు చేయడం మంచి నిర్ణయమే. ఈ నిర్ణయం కొత్తగా తీసుకున్నది ఏమీ కాదు. గతంలో ఉన్న కొన్ని నిబంధనలను జీవో నంబర్ 1గా తీసుకొచ్చారు. సభల విషయమై ముందస్తు సమాచారం ఇస్తే తగిన ఏర్పాట్లు చేసుకుని అనుమతి ఇస్తారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ నాయకులు, అధికారుల బాధ్యత.
ఈ జీవోలో ఎక్కడా సభలను నిషేదిస్తున్నట్లు చెప్పలేదు. కేవలం రోడ్లపై మాత్రమే వద్దని చెబుతోంది. అలాగే ఈ జీవో అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది” అంటూ వీవీ లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. ఇంక వీవీ లక్ష్మీ నారాయణ రాజకీయాల విషయానికి వస్తే.. గతంలో జనసేనలో ఉన్న ఆయన విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ చెబుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల సమయానికి వీవీ లక్ష్మీ నారాయణ ప్రముఖ రాజకీయ పార్టీలో చేరతారంటూ ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం లక్ష్మీ నారాయణ.. జగన్ నిర్ణయాన్ని సమర్థించడంపై పెద్దఎత్తున రాజకీయ చర్చ నడుస్తోంది.