ఏపీలో టీడీపీ, వైసీపీ కి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అధికార పార్టీ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతలను భయాందోళనకు గురి చేస్తున్నారని.. అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారని టీడీపీ నేతలు అరోపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు రాజేష్ తో పాటు మరికొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై పెద్ద రగడ కొనసాగుతుంది.
నర్సీపట్నంలో ఇటీవల మరిడిమాంబ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. అయితే ఈ ఉత్సవాలకు పోలీసులు కేవలం రాత్రి 11 గంటలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.. కానీ ఉత్సవ కార్యక్రమాలు అర్థరాత్రి దాటిన తర్వాత కూడా జరగడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఆపేయాలని ఆదేశించారు. అదే సమయానికి అయ్యన్నపాత్రుడు వచ్చి ఉత్సవాలు ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు ఆయనే దగ్గర ఉండి ఉత్సవాలు నిర్వహించారు.
ఈ క్రమంలో పోలీసులకు అయ్యన్న పాత్రుడు ఆయన కొడుకు రాజేష్ లు పోలీసులను అవమానించారని.. విధులకు ఆటంకం కలిగించారని అంతే కాదు బెదిరింపులకు పాల్పడ్డారని విధి నిర్వహణలోఉన్న ఎస్సైపై దౌర్జన్యానికి దిగారని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇది కావాలని పోలీసులు చేస్తున్న కుట్ర అని తాము కేవలం ఉత్సవాలు జరిపించామని టీడీపీ నేతలు చెబుతున్నారు.