ఇంట్లో కొన్ని వస్తువులు పెడితే సానుకూల ప్రభావం చూపిస్తుందని పండితులు అంటున్నారు. ఆయా వస్తువులను ఉంచితే డబ్బు విషయంలో ఢోకా ఉండదని చెబుతున్నారు. అవేంటో చూద్దాం పదండి..
ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ నూతన సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకుంటారు. కానీ తెలుగువారు మాత్రం ఉగాది పండుగ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు. మన సాంప్రదాయం ప్రకారం అసలైన కొత్త ఏడాది ఉగాది రోజు ప్రారంభమవుతుంది. ఆ పండుగ నాడు షడ్రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా సేవిస్తారు. ఈ ఏడాది ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతోందనేది పండితుల పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు. ఇళ్లల్లో భక్షాలు చేసుకుని ఆరగిస్తారు. అయితే ఈ కొత్త ఏడాది వేళ ఇంట్లో కొత్త వస్తువులను తెచ్చుకుంటే బాగుంటుందని పండితులు చెబుతుంటారు. ఇంట్లోకి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే అదృష్టం అని అంటుంటారు. మరి.. అలాంటి వస్తువులేంటో ఒకసారి తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి లేదా కొబ్బరి బోండాం ఏదైనా సరే లక్ష్మీకి ప్రతీకగా భావిస్తారు. అందుకే పూజల్లో కొబ్బరికాయకు ప్రత్యేక స్థానాన్ని ఇస్తుంటారు. టెంకాయ కొట్టకుండా ఇంట్లో ఏ పూజ కూడా పూర్తి కాదు. చిన్న ఎండు కొబ్బరిని తీసుకుని దాన్ని పూజలో ఉంచి తర్వాత డబ్బు దాచే చోట పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. తులసి మొక్కను ఇంట్లో ఉంచుకున్నా ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయని అంటుంటారు. తులసి పవిత్రమైందే కాదు.. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్క. తులసి ఉన్న ఇల్లు సుఖశాంతులతో, సిరిసంపదలతో తులతూగుతుందని పెద్దలు కూడా చెబుతుంటారు. ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇల్లు తీర్థ స్వరూపం అని శాస్త్రం చెబుతోంది.
తులసి మొక్కను వాకిట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లేనని చెప్పొచ్చు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనాలంటే తాబేలు ప్రతిమను కూడా పెట్టుకోవచ్చు. లోహపు తాబేలును ఇంట్లోకి తెచ్చుకుంటే మహాలక్ష్మి నడిచొస్తుందని పెద్దల నమ్మకం. తాబేలు ప్రతిమ వల్ల వాయిదా పడిన పనులు, ఆలసమైన పనులు కూడా వేగంగా పూర్తవుతాయట. ఇత్తడి, వెండి, గాజు తాబేలును ఇంటికి తెచ్చుకున్నా మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ముత్యపు చిప్పను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ముత్యపు చిప్ప ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ డబ్బులకు లోటుందదు. పూజ చేసిన తర్వాతే దాన్ని డబ్బు దాచే చోట పెట్టాలని పండితులు సలహా ఇస్తున్నారు. నెమలి పింఛం ఇంట్లో ఉన్నా మంచిదేనని.. అది ఉండే దగ్గర లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటుందని చెబుతున్నారు.