సాధారణంగా జనావాసాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చూసుకుంటారు. కానీ అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్‌లోనే కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఓ పోలీస్ స్టేషన్‌లో పేలుడు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఇక పోలీస్ స్టేషన్ ఆవరణలో వెనుక వైపు ఉన్న భవనం దగ్గర శనివారం వేకువజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు శబ్ధం వినిపించింది. ఈ పేలుడు ఘటనలో పోలీస్ స్టేషన్ అద్దాలు, తలుపులు, కిటీకీలు.. వివిధ కేసుల్లో పట్టుబడిన కార్లు, బైకులు పూర్తిగా ధ్వంసం అయినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన నేపథ్యంలో.. ముందుగా నాటుబాంబు పేలిందేమో అని పోలీసులు భావించారు. అయితే క్వారీల్లో ఉపయోగించే జిలిటెన్ స్టిక్స్ పేలి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుడు ఘటనతో పోలీసులు, జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు జరిగిన సమయంలో పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ఆంజనేయులు రెడ్డి, కానిస్టేబుల్ గజేంద్ర దానిలోనే ఉన్నారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.