గతంతో పోలిస్తే ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒకప్పుడు వేలల్లో ధర పలకడం కూడా కష్టంగా ఉన్న స్థలాలకు ప్రస్తుతం కోట్లలో ధర లభిస్తుంది. దాంతో గతంలో తక్కువ ధరలకు భూములు అమ్ముకున్న వాళ్లు.. ప్రస్తుతం బాధపడుతున్నారు. మరి కొందరు మాత్రం అమ్మిన భూమలును తిరిగి తీసుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందని సంఘటన ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. ఈ సంఘటన భూమా కుటుంబంలో చోటు చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. ఆస్తి వివాదం నేపథ్యంలో భూమా అఖిల ప్రియపై ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్ రెడ్డి హై కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఇదే కేసును కింది కోర్టులో ఈ కేసు నిలబడలేదు. తమ్ముడితో కలిసి అక్కలు ఆడుతున్న డ్రామాగా న్యాయస్థానంలో నిరూపించడంతో కేసు కొట్టి వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే కేసులో మరోసారి హైకోర్టులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రయత్నించడం గమనార్హం. కేసుకు దారి తీసిన పరిస్థితులు ఏంటంటే…
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మంచిరేవులలో భూమా నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి పేరుతో వెయ్యి గజాల స్థలం ఉంది. 2016లో ఆ భూమిని భూమా నాగిరెడ్డి దాదాపు రూ.2 కోట్లకు వేరేవారికి అమ్మినట్టు తెలిసింది. అప్పటికి శోభా నాగిరెడ్డి మరణించడంతో రిజిస్ట్రేషన్ సమయంలో భూమా నాగిరెడ్డి ఆయన ఇద్దరు కూతుళ్లు అఖిలప్రియ మౌనిక సంతకాలు చేశారు. జగత్ విఖ్యాత్ రెడ్డి వయసు 17 సంవత్సరాలు కావడంతో వేలిముద్ర వేశాడు.
ప్రస్తుతం ఈ భూముల రేట్లు భారీగా పెరగడంతో నాగిరెడ్డి రెండు కోట్ల రూపాయలకు అమ్మిన స్థలం రూ.6 కోట్లకు చేరింది. దీంతో తాము అమ్మిన భూమిపై అక్కాతమ్ముళ్ల కన్నుపడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2019 నవంబర్ 14న ఇద్దరు అక్కలతో పాటు ప్లాట్లను కొనుగోలు చేసిన వారిపై కింది కోర్టులో జగత్ విఖ్యాత్ రెడ్డి కేసు వేశాడు. అయితే అక్కలిద్దరూ కావాలనే జగత్‌తో కేసు వేయించారని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జగత్ విఖ్యాత్ రెడ్డి తన లాయర్ గా అఖిలప్రియ మరిది శ్రీసాయిచంద్రహాస్‌ను పెట్టుకోవడం ఇందుకు నిదర్శనమంటున్నారు. అయితే కింది కోర్టులో వీరికి అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో జగత్ విఖ్యాత్ రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టులో ప్లాట్లను కొనుగోలు చేసిన ఐదుగురితో పాటు తన ఇద్దరు అక్కలపై కూడా కేసు వేశాడు.
తనకు 17 ఏళ్ల వయసులో మైనర్‌గా ఉన్నప్పుడు స్థలం అమ్మారని.. ఇది చెల్లదని.. ఇప్పుడు తాను మేజర్‌ని అని తనకు భాగం కావాలని జగత్ విఖ్యాత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. జగత్ కోర్టుకు వెళ్లడం వెనుక అఖిలప్రియ ఆమె భర్త భార్గవ్ రామ్ ప్రోత్సాహమే కారణమని స్థలం కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. మరి ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.