బెండపూడి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ పాఠశాల, అక్కడి విద్యార్థులు ఎంతో ఫేమస్ అయిపోయారు. ఎంతలా అంటే అమెరికన్ కాన్సులేట్ జనరల్ ఈ పిల్లల యాక్సెంట్ చూసి ముచ్చట పడి వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. వారి భాషను, యాక్సెంట్‌ను మరింత మెరుగు పరుచుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ ఆకాంక్షించారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం అనేది నిజంగా మెచ్చుకోవాల్సిన అంశం. మధ్యతరగతి, పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల ప్రతిభను చూసి కచ్చితంగా గర్వపడాలి.
ఏపీ సీఎం జగన్ సైతం ఆ పిల్లలను ప్రత్యేకంగా పిలిపించి ముచ్చటించడం చూశాం. పిల్లలు అంతబాగా మాట్లాడేందుకు కృషి చేసిన ప్రసాద్ అనే టీచర్‌ని సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రశంసించింది. అంతేకాకుండా ఒక్క బెండపూడి పాఠశాల పిల్లలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో ఉన్న పిల్లలు ఇంతే చక్కగా ఇంగ్లీష్ మాట్లాడాలంటూ అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మొదటి పైలట్ ప్రాజెక్ట్ గా మొదలై.. ఇప్పుడు అన్ని జిల్లాల్లోని ఐదు పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థులను ట్రైన్ చేయాలని ఆదేశించారు. అలా బెండపూడి విద్యార్థులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు.
ఆ విద్యార్థుల కృషి పట్టుదల చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. తప్పకుండా మెచ్చుకోవాలి అనిపిస్తుంది. కానీ, ఏపీలో మాత్రం పరిస్థితులు ఇందుకు చాలా భిన్నంగా ఉన్నాయి. మెచ్చుకోవాల్సిన వాళ్లని ట్రోల్స్ తో బెంబేలెత్తించారు. ఎంతలా అంటే అసలు స్కూలుకు వెళ్లాలి అంటేనే భయభ్రాంతులకు గురయ్యేలా చేశారు. ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీ పని కట్టుకుని ఈ చిన్నారులపై ట్రోలింగ్ చేయడం చూశాం. అంతేకాకుండా ట్రోల్ చేసే వారిని ఎలాంటి సిగ్గు, బిడియం లేకుండా బాహాటంగానే ప్రోత్సహించడం చూస్తే ఆశ్చర్యం.. అదే సమయంలో అలాంటి వారి మనస్థత్వంపై జుగుబ్స కూడా కలగక మానదు. అత్త మీద కోపం దుత్త మీద చూపించారనే సామెత వినే ఉంటారు. ఆ చందాన పిల్లలని కూడా చూడకుండా వారిని విపరీతంగా ట్రోల్ చేశారు, చేయించారు.
ఇదే ఇంగ్లీష్, ఇదే యాక్సెంట్ లో ఒక ప్రైవేటు స్కూల్ పిల్లాడు మాట్లాడితే ఇలాగే ట్రోల్ చేస్తారా? వీళ్లని ప్రశ్నించినట్లుగానే వాళ్లని కూడా ప్రశ్నిస్తారా? ఇక్కడ వీరి సమస్య ఏంటి.. పిల్లలు అంత అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడటమా? లేక ప్రభుత్వ పాఠశాల పిల్లలు అంత గొప్పగా ఇంగ్లీష్‌లో మాట్లాడటమా? అణ్యం పుణ్యం తెలియని ఆ చిన్నారులను అంతలా ట్రోల్ చేయడంతో పిల్లలను పాఠశాలకు పంపాలన్నా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. ట్రోలింగ్ గురైన వారిలో ముఖ్యంగా మేఘన అనే అమ్మాయిని మానసికంగా ఎంతో కుంగిపోయింది. వారి తల్లిదండ్రులైతే మీడియా అనే పదం విన్నా వెన్నులో వణుకుపుట్టేలా చేశారు.
మేఘన అనే అమ్మాయి మాట్లాడిన ఇంగ్లీష్ యాక్సెంట్ వీడియోలను అసభ్య, అభ్యంతరకర మాటలతో ఎడిట్ చేశారు. ఈ విషయంపై మేఘన మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురైంది.. “మా నాన్న ఒక చిన్న రైతు.. మాది పేద కుటుంబం. పెద్ద పెద్ద కార్పొరేట్ సూల్స్ లో చేర్పించలేక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. స్కూల్ డెవలప్ అవ్వడం వల్ల నేను బాగా ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. అది చూసి సీఎం సార్ పిలిచి మెచ్చుకున్నారు. ఆ తర్వాత నా మీద విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అవి చూసి నేను మానసికంగా ఎంతో కుంగిపోయాను. ఆ సమయంలో మా టీచర్స్, పేరెంట్స్, రిలేటివ్స్ అంతా నాకు సపోర్ట్ చేశారు. తిరిగి నేను నార్మల్ అయ్యేలా చేశారు” అంటూ మేఘన చెప్పుకొచ్చింది.
ఆ స్కూల్ లో ఉన్న ఏ విద్యార్థిని కదిలించినా.. ఏ తల్లిదండ్రులను కదిలించినా దాదాపుగా ఇదే భావన. కార్పొరేట్ స్కూళ్లకు పంపే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలకు పంపారు. అక్కడ వాళ్ల అబ్బాయి నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే చూసి సంబరపడిపోయారు. సీఎం పిలిచి శభాష్ అనగానే ఆ తల్లిదండ్రుల ఆనందంగానికి హద్దులు లేకుండా పోయాయి. అలాంటి చిన్నారులపై ఒక పార్టీ, వారి జనగణం చేసిన ట్రోలింగ్, దాని ద్వారా వాళ్లు పొందిన పైశాచికానందం ఈ చిన్నారుల హృదయాల్లో విషాదాన్ని నింపాయి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే.. ప్రారంభంలోనే ఇలాంటి వారు కూడా ఉంటారు అని తెలుసుకుని, వారిని ఎదిరించి నిలిచిన వీళ్ల ధైర్యాన్ని సైతం మెచ్చుకోకుండా ఉండలేం.