Bendapudi: కొన్ని రోజుల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్‌లోనే కాక.. దేశవిదేశాల్లో కూడా బెండపూడి ప్రాథమిక పాఠశాల పేరు మార్మోగిపోయింది. అమెరికా కాన్సులేట్ జనరల్ స్వయంగా బెండపూడి విద్యార్థులతో మాట్లాడి.. వారిపై ప్రశంసలు కురిపించారు. అమెరికా వచ్చి చదువుకుంటారా అని ఆఫర్ కూడా ఇచ్చారు. బెండపూడి విద్యార్థులు మాట్లాడిన అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్‌కు అమెరికా కాన్సులేట్ జనరల్ అబ్బురపడ్డారు. వెల్డన్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక బెండపూడి విద్యార్థుల ప్రతిభ గురించి జాతీయ మీడియాలో కూడా పలు కథనాలు ప్రసారం కావడంతో.. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి అది అక్కడితోనే ఆగిందా అంటే లేదు.. ఆ విద్యార్థులు చూపిన ప్రతిభ భవిష్యత్తులో ఎందరో విద్యార్థుల తలరాతను మార్చబోతోంది. బెండపూడిని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
అసలేంటి బెండపూడి కథ..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువు అంటే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాఠశాలలో కనీస మౌలిక సౌకర్యాలుండవు. కొన్ని చోట్ల అయితే.. అన్ని తరగతులకు పాఠాలు చెప్పేందుకు సరిపడా టీచర్లు కూడా ఉండరు. ఇంగ్లీష్ మాట దేవుడెరుగు.. కనీసం మాతృభాషలో ఓనమాలు రావడం కూడా కష్టమే. అందుకే చాలా మంది తల్లిదండ్రులు ఆర్థిక భారం అని తెలిసినప్పటికి.. అప్పులు చేసి మరీ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేరుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకినాడ జిల్లా బెండపూడి జెడ్పీ హైస్కూల్‌లో కూడా కొన్ని రోజుల క్రితం వరకు ఇవే పరిస్థితులు.
కానీ, ఓ మాస్టార్ పట్టుదల, ప్రభుత్వ ప్రొత్సాహంతో.. నేడు అక్కడ పరిస్థితులు మారాయి. ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే.. ఇంగ్లీష్ తప్పనిసరి. ఆంగ్లంపై పట్టు సాధిస్తే.. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేటి కాలంలో ప్రైవేట్ స్కూల్స్‌లో చదివే వారికే ఇంగ్లీష్ సరిగా రాదు.. అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికి ఏపీ ప్రభుత్వం, బెడంపూడి ప్రభుత్వ పాఠశాల టీచర్లు ముందుకు వచ్చారు. విద్యార్థులను ఇంగ్లీష్‌లో మాట్లాడేలా తీర్చిదిద్దడం కోసం ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌లు నిర్వహించారు. ఫలితంగా నేడు బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్‌లో గలగలా మాట్లాడుతున్నారు.
విద్యార్థుల ప్రతిభపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. ఇక ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడమే కాక.. బెండపూడి మోడల్‌ను అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రయోగం కేంద్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో బెండపూడి మోడల్‌ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్ల క్రితం ఈ విద్యార్థులు మాట్లాడిన ఇంగ్లీష్‌ను కొన్ని రాజకీయ పార్టీలు హేళన చేశాయి. కానీ, నేడు అదే బెండపూడి దేశానికి ఆదర్శంగా నిలవడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి, బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రతిభపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : YS Jagan Mohan Reddy: ఏపీలో అక్టోబర్ 1 నుంచి కల్యాణమస్తు, షాదీ తోఫా.. హమీల్లో 98.44 శాతం అమలు చేసిన వైఎస్ జగన్