ఆధ్యాత్మికతకు నిలయంగా ఉండే ఆలయంలో బెల్టు షాపు వేలంపాట నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఇదెక్కడ జరిగిందంటే..!
ఆల్కహాల్ వినియోగం రోజురోజుకీ ఎక్కువవుతోంది. మద్యపాన వాడకం అంతకంతకీ పెరుగుతోందే గానీ తగ్గడం లేదు. ముఖ్యంగా యువత మందుకు బానిసలుగా మారుతున్నారు. మద్యపానానికి బానిసలై ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీని వల్ల కొందరు అనారోగ్యాల బారిన పడితే.. మరికొందరు ఆర్థికంగా చితికిపోయారు. తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు ఇంట్లో పెద్దదిక్కును కోల్పోయాయి. ఇన్ని జరుగుతున్నా, మందు తాగొద్దని ఎవరెంత మొత్తుకుంటున్నా ఊహించినంత మార్పు కనిపించడం లేదు. పండుగలు, పబ్బాలు, వీకెండ్స్‌లోనే కాదు.. ఆ మాటకొస్తే ప్రతి రోజూ తాగి మత్తులో చిత్తవుతున్నారు మందుబాబులు.
మద్యపాన వాడకాన్ని తగ్గించాలని ఎక్కువ ధరలకు లిక్కర్‌ను అమ్ముతున్నా కొనేవారి సంఖ్య తగ్గడం లేదు. పైపెచ్చు అప్పుచేసి మరీ తాగుతున్నారు మందుబాబులు. ఇదిలా ఉండగా.. దేవుడి గుడిలో వేలంపాట నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. పూజలు, వ్రతాలు నిర్వహించే ఆలయంలో బెల్టు షాపు వేలంపాట వేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా, పాతసముద్రం గ్రామంలో చోటుచేసుకుంది. ఎంఆర్పీ ధరలకు కాకుండా మద్యాన్ని ఇష్టారాజ్యంగా పెంచుకుని అమ్మే అవకాశం ఉండటంతో బెల్టు షాపును దక్కించుకునేందుకు జనాలు ఎగబడ్డారు. ఈ వేలంలో షాపును రూ.3.80 లక్షలకు ఒక వ్యక్తి దక్కించుకున్నాడట. అయితే గుడిలో వేలంపాట నిర్వహించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కొందరు స్థానికులు విమర్శిస్తున్నారు.