‘బిచ్చగాడు’ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. చిన్న సినిమాగా వచ్చి..అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకు ఆ సినిమా కథే ప్రధాన కారణం. ఆ మూవీలో ధనవంతుడైన హీరో.. తల్లి ఆరోగ్యం కోసం బిచ్చగాడిగా మారి భిక్షాటన చేసేవాడు. అయితే అతడు ఏ రోజు వచ్చిన సంపాదనను ఆరోజు.. తన ఖర్చులు పోను..హుండిలో వేసేవాడు. అలా కొన్ని నెలల పాటు జీవితాన్ని గడిపాడు. అచ్చం అలానే తాజాగా ఓ వృద్ధుడు కూడా పెద్ద మనసు చాటుకున్నాడు. తాను భీక్షాటన చేయగా వచ్చిన డబ్బులను కొంత తన వద్ద ఉంచుకుని మిగిలినవి దేవుడి హుండిలో వేశాడు. అతడి పెద్ద మనస్సుకు స్థానికులు అభినందనలు తెలిపారు. ఈ ఘటన విశాఖ పట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన పురంధర్ అనే వ్యక్తి 14 ఏళ్ల క్రితం విశాఖపట్నంకి వలస వచ్చాడు. అక్కడ స్థానికంగా ఉంటూ భిక్షాటన చేసుకునేవాడు. ఈ క్రమంలో పట్టణంలోని నక్కవానిపాలెంలోని ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం వెనుక ఉన్న ఓ స్నానాల గదినే ఇల్లుగా మార్చుకున్నాడు. భిక్షాటనతో సంపాందించిన డబ్బులు, తన దుస్తువులను ఆ రూమ్ లోనే దాచుకున్నాడు. గుడికి వచ్చే భక్తుల ఇచ్చే చిల్లరను దాచుకుంటూ, ప్రసాదాన్ని తింటూ జీవనం సాగించేవాడు. ఇలా కొన్నేళ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల ఆలయ పూజారికి, ఆ వృద్ధుడికి మధ్య గొడవ జరిగిందంట. ఈ క్రమంలో ఆ పూజరి.. బాత్ రూమ్ లోని పురంధర్ బట్టలను, ఇతర వస్తువులను బయట పడేశాడు.
ఇంతలో అతడి వస్తువులోని ఓ మూట లో నుంచి నోట్లు, చిల్లర డబ్బులు చెల్లాచెదురుగా పడిపోయాయి. అలా కిందపడిన డబ్బులను చూసి పూజారితో పాటు గుడికి వచ్చిన వారు సైతం అవాక్యయ్యారు. ఈ విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు ఆ వ్యక్తి గురించి ఆరా తీశారు. దీంతో నిజంగానే పురంధర్ భీక్షాటన చేసే డబ్బులు సంపాదించాడని తెలిసింది. అతని వద్ద ఉన్న మొత్తాన్ని లెక్కించగా రూ. లక్షకుపైగానే ఉన్నాయి. పురంధర్ పెద్ద మనసుతో ఆ డబ్పులోని రూ.50 వేలు దేవుడి హుండీలో వేశాడు. మిగిలిన డబ్బులను తన ఆరోగ్యం కోసం దాచుకుంటానని అన్నాడు. పురంధర్ పెద్ద మనసుకు ఆలయ అధికారులతో పాటు స్థానికులు అభినందించారు.
డబ్బులు ఉండి దానం చేయడానికి మనస్సు రాని వాళ్లు పురంధర్ చూసి మారాలని, ఆయన ఎంతో మందికి ఆదర్శమని స్థానికులు ప్రశంసించారు. తన కుటుంబాన్ని వదిలేసి.. ఏళ్ల తరబడి బయట ప్రాంతాంలో ఒంటరిగా బ్రతికేస్తున్న ఆయనను చూసి అందరు షాకయ్యారు. ఈ సమాజంలో చాలామంది తోటివాళ్లకు సాయం చేయాలంటే వెనుకాడతారు. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరు అంటూ ఒక్కోసారి పెద్దలు చెప్పిన మాటగా ఉపయోగిస్తుంటారు. అలాంటిది పురంధర్ మాత్రం తన పెద్ద మనసు చాటుకున్నాడు.