విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు గుండెపోటుకు గురై మృతి చెందాడు. దీంతో అక్కడ విషాదఛాయలు అలముకున్నాయి.
ఈమధ్య గుండెపోటుతో మరణిస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అందునా వీరిలో 40 ఏళ్లు దాటని వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కలకలం రేపుతోంది. ఒకప్పుడు వృద్ధుల్లోనే ఎక్కువగా హార్ట్ ఎటాక్ రావడాన్ని చూశాం. కానీ ఇప్పుడు యువత కూడా ఈ వ్యాధి బారిన పడటం, చాలా మంది పిన్న వయసులోనే మరణించడం కూడా చూస్తున్నాం. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, కంటి నిండా నిద్రపోకపోవడం, ఎక్కువ ఒత్తిడికి గురవ్వడం, వ్యాయామం చేయకపోవడం లాంటివి గుండెపోటుకు ప్రధాన కారణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం, మధుమేహం ఉన్న వారు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
సిగరెట్, ఆల్కహాల్ లాంటి ప్రమాదకర అలవాట్లను వెంటనే మానేయాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. లైఫ్ స్టైల్ కూడా ఈ హార్ట్ ఎటాక్ రావడానికి ఓ కారణమని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇదిలాఉండగా.. విద్యార్థులకు పాఠాలు చెబుతూ గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడో ఉపాధ్యాయుడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా, చీరాల మండలం, వాడరేవు దారిలోని పాలెం ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠాలు చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు టీచర్. వెంటనే విద్యార్థులు తోటి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వాళ్లు 108కి కాల్ చేశారు. దీంతో వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వాళ్లు వైద్య సేవలు చేసినా అప్పటికే ఆయన మృతి చెందాడని నిర్ధారించారు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించనున్నారు.