మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పొందటం కోసం కడప ఎంపీ అవినాష్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది.
కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. సీబీఐ, సునీత, అవినాష్‌రెడ్డిల తరపు న్యాయవాదుల వాదోపవాదాలు విన్న కోర్టు మంగళవారం సాయంత్రం తీర్పును వెలువరిచింది. ఈ నెల 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దని కోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. 25వ తేదీ వరకు సీబీఐ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వెళ్లాలని అవినాష్‌రెడ్డిని ఆదేశించింది. అవినాష్‌రెడ్డి విచారణకు సంబంధించి ఆడియో, వీడియోలను రికార్డు చేయాలని కోర్టు సీబీఐకి సూచించింది.
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై 25న తుది తీర్పు వెలువరించనున్నట్లు తెలిపింది. కాగా, ఈ ఉదయం నుంచి కోర్టులో సీబీఐ, సునీత, అవినాష్‌రెడ్డిల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది బెయిల్ మంజూరు చేయమని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలోనే అవినాష్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ, సునీత తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. రేపు ఉదయం 10.30 గంటలకు అవినాష్‌రెడ్డిని విచారిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది.