అయ్యప్ప స్వామి.. ఈ పేరు వింటేనే చాలా మంది భక్తులు పులకరించిపోతారు. స్వామి వారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్లు నిష్ఠగా 41 రోజులు పూజలు చేస్తారు. తరువాత ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కోసం శబరిమలకు వెళ్తుంటారు. శబరిమలకు వెళ్లే వారు రైలు, బస్సు, ఇతర వాహనాల్లో వెళ్తుంటారు. కొందరు అయ్యప్ప భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కాలినడక ద్వారా శబరిమల చేరుకుంటారు. అయితే మరికొందరు మాత్రం ఏళ్ల తరబడి తమదైన శైలిలో శబరిమలకు వెళ్తు స్వామి వారిని దర్శించుకుంటారు. అలాంటి వారిలో అనంతపురం జిల్లాలోని రాయదుర్గం చెందిన ఎం.శివకుమార్ ఒకరు. ఆయన సైకిల్ పై శబరిమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. అలా అని ఒకటి , రెండు ఏళ్లు కాదు.. ఏకంగా పదేళ్ల నుంచి సైకిల్ పై శబరిమలకి వెళ్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కోటవీధికి చెందిన ఎం. శివకుమార్ దర్జీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు అయ్యప్ప స్వామి అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రతి ఏటా అయ్యప్ప మాల ధరించి శబరిమలైకు వెళ్తుంటాడరు. అదికూడా బస్సులు , రైళ్లలో కాదు.. సైకిల్ పై తన శబరిమలై యాత్రను కొనసాగిస్తుంటారు. ఇలా శివకుమార్ పదేళ్లుగా సైకిల్ పై శబరిమలకు వెళ్తున్నారు. అందుకే రాయదుర్గంలోని ప్రజలు ఆయన్ను సైకిల్ స్వామి అని పిలుస్తుంటారు. శివకుమార్ సైకిల్ పై మైసూరు మీదుగా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణిస్తూ శబరిమలకు చేరుకుంటారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా డిసెంబర్ 26 ఉదయం శబరిమలకు బయల్దేరనున్నట్లు శివకుమార్ తెలిపారు.
అయితే ఈ సారి బెంగళురూ మీదుగా వెళ్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ప్రయాణం ప్రారంభిస్తే.. మకర సంక్రాంతికి అక్కడికి చేరుకుంటానని ఆయన తెలిపారు. సైకిల్ పై తాను సాగిస్తున్నా ఈ యాత్ర వెళ్లడానికి 14 రోజులు, రావడానికి 14 రోజుల సమయం పడుతుందని శివకుమార్ తెలిపారు. ఈ ప్రయాణ సమయంలో తనతో పాటు గాలిపంపు, పంక్చర్ సామాగ్రి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. ఈ పదేళ్ల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే సైకిల్ పంక్చర్ అయ్యిందని ఆయన తెలిపారు. ఆ అయ్యప్ప స్వామి కటాక్షంతో తన యాత్ర దిగ్విజయంగా పూర్తవుతుందని శివకుమార్ అన్నారు. శబరిమల యాత్ర సమయంలో మార్గం మధ్యలో ఎదురయ్యై పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుని వస్తుంటానని శివకుమార్ తెలిపారు.
నీటి సౌకర్యం ఉన్న చోట ఉదయం, సాయంత్రం స్నానం చేస్తానని, అయ్యప్ప స్వాముల హోటళ్లలో ఆహారం తీసుకుంటానన్నారు. యాత్రలో భాగంగా రాత్రిపూట గ్రామాల్లోని అయ్యప్ప సన్నిధానాల్లో భోజనం చేసి, అక్కడి నిద్రించి తిరిగి మరుసటి రోజు ఉదయం యాత్రను కొనసాగిస్తాన్ని శివకుమార్ తెలిపారు. మార్గం మధ్యలో ఆయన సైకిల్ యాత్ర గురించి తెలుసుకున్న వాళ్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారంట. మరీ… పదేళ్ల నుంచి సైకిల్ పై శబరిమలకు యాత్ర చేస్తున్న శివకుమార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.