ఆర్థిక లావాదేవీల పరంగా దేశంలో మూడో అతి పెద్ద ప్రయివేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ సమాజసేవకు ముందడుగు వేసింది. పలు కార్పొరేట్ ఆసుపత్రుల భాగస్వామ్యంతో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది.
బ్యాంకులంటే ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవి మాత్రమే కాదు.. ఆరోగ్య పరంగానూ సేవలు అందించగలం అని నిరూపిస్తోంది.. యాక్సిస్ బ్యాంక్. ఎంపికచేసిన బ్యాంక్ బ్రాంచుల వద్ద ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది. ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడంతో పాటుగా సమాజానికి వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ సేవలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలకు మాత్రమే. ఎక్కడెక్కడ ఈ ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్‌లలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఆరోగ్య శిబిరాలను విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నంలలో ఎంపిక చేసిన యాక్సిస్ బ్యాంక్ కేంద్రాల వద్ద నిర్వహించనున్నారు. అందుకోసం ఈ బ్యాంక్.. అపోలో హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్, మ్యాక్సివిజన్ హాస్పిటల్స్, శంకర్‌నేత్రాలయ వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఆరోగ్య శిబిరాలలో ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా డాక్టర్ల కన్సల్టేషన్ కూడా పూర్తిగా ఉచితం. ఈ పరీక్షల్లో కంటి పరీక్షలు, రక్తపోటు (బీపీ), ర్యాండమ్ బ్లడ్ షుగర్(ఆర్‌బీఎస్), ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) వంటివి ఉంటాయి.