కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేతలు సిద్దం అవుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు మరోమారు ఉప ఎన్నికల బరిలో సత్తా నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఈనెల 30 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం షురూ చేయగా, అధికార వైసీపీ, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
తాజాగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బద్వేల్ బరిలో జనసేన పోటీ చేయడం లేదని శనివారం నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో వెల్లడించారు. దాంతో ఇప్పుడు అక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ మద్య పోరు నడుస్తుంది. ఇక ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్న తరుణంలో గ్రామస్తులు ట్విస్ట్ ఇచ్చారు. బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలంలో ఎన్నికల బహిష్కరణ ఫ్లెక్సీలు వెలిశాయి. చిన్నరాజుపల్లె గ్రామ ప్రజలు ఎలక్షన్స్ ను బహిష్కరిస్తున్నట్లు తమ గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఏళ్లుగా రోడ్డు నిర్మించాలని వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. రోడ్డు మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ గ్రామాల సమస్యల్ని, అభివృద్ధిని పట్టించుకోవడంలేదని గోసపడుతున్నారు. అందుకే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.