తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే ఎంత సంబరంగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లిన వారు సంక్రాంతి పండుగకు తమ సొంత ఊళ్లకు చేరుకుంటారు. ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకునేందుకు పిల్లలు, పెద్దలు, యువకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరికొద్ది రోజుల్లోనే సంక్రాంతి పండగ రానుంది. అయితే ఊరిని వదలి ఎక్కడ పట్టణాల్లో నివాసం ఉంటున్న వాళ్లు సంక్రాంతి కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. అయితే ఇదే సమయంలో కొందరు ట్రావెల్స్ వాళ్లు పెద్ద ఎత్తున ఛార్జీలు వసూలు చేస్తూ అందిన కాడికి డబ్బులు దండుకుంటుంటారు. చాలా మంది ఛార్జీలకు భయపడి కూడా ఊర్లకు వెళ్లడం వాయిదా వేసుకుంటారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. పండగకి ఊరికి వెళ్లే వారికి రాయితీని ప్రకటించింది.
సంక్రాంతికి ఊర్లకు వెళ్తున్న వారికి ఏపీఎస్ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పండగకు ఊరికి వెళ్లే వారు రానూపోనూ టిక్కెట్టును ముందుగా బుక్ చేసుకుంటే రాయితీ ఇవ్వనుంది. టిక్కెట్టు ముందుగా బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో(ఏసీ, నాన్ ఏసీ ) 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. అంతే కాక సంక్రాంతికి ఊరికి వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ మరో వెసులుబాటు కల్పించింది. పండగ సమయంలో రద్దీ నేపథ్యంలో ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అంతే కాక గతంలో వసూలు చేసినట్లు స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీని వసూలు చేయడం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇటీవల దసర సమయంలో కూడా సాధారణ చార్జీలతోనే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. ఆసమయంలో ప్రయాణికుల నుంచి భారీ స్పందన రావడంతో ఆశించిన స్థాయిలో ఆదాయం వచ్చింది. ప్రజల్లో ఆశించిన స్పందన రావడంతో సంక్రాంతి కి కూడా ప్రత్యేక బస్సులకు అదనపు చార్జీలు లేకుండానే నడపాలని నిర్ణియించింది. ఇది సంక్రాంతికి ఊరి వెళ్లాలనుకునే వారి భారీ ఊరట కలిగించింది. అంతేకాక సంక్రాంతి పండగకి ఊర్లకు వెళ్లే వారి కోసం ఇటీవలే ఆర్టీసీ ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈక్రమంలో దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఇప్పటి నుంచి తమ టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు. తాజాగా ఆర్టీసీ ప్రకటించిన ఈ ప్రత్యేక రాయితీ గురించి తెలిసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
సంక్రాంతి కి ఊరెళ్లే వారు ఆర్టీసి బస్సులో టిక్కెట్ ను apsrtconline అనే వెబ్ సైట్ ద్వారా ముందుగా బుక్ చేసుకోవచ్చని సూచించారు. సంక్రాంతి పండగ సమయంలో రద్దీకి అనుగుణంగా అవసరమైన బస్సులను నడుపుతామని అధికారులు తెలిపారు. సంక్రాంతికి వారం రోజుల ముందు నుంచి ప్రయాణికుల రద్దీ మొదలవుతుంది. ఆ ప్రకారం జనవరి 7,8 తేదీల నుంచి ఈ స్పెషల్ బస్సులు అందుబాటులోకి తెస్తారు. అలానే తిరుగు ప్రయాణం చేసేవారికి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
తెలంగాణ సంక్రాంతి స్పెషల్ బస్ సర్వీసులు:
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లే సమయంలో ప్రయాణీకులు నానా అవస్థలు పడుతుంటారు… ఈ క్రమంలో ప్రయాణీకులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా 4,233 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. అంతేకాదు ఇందులో 585 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో పాటు 60 రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యం కూడా కల్పించింది. ఇక ఈ ప్రత్యేక బస్సులు జనవరి 7 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.