ఏపీఎస్ ఆర్టీసీ ప్రజలను ఆకర్షితులను చేయుటకు అనేక విధాలుగా ప్రోత్సహిస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సదుపాయాలను కల్పిస్తోంది. వాటిని ప్రజలు వినియోగించుకోవాలి. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు దర్శన టికెట్లను తీసుకునేందుకు సౌకర్యం కల్పించింది.
ఏపీఎస్ ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రజల ఆదరణ పొందుటకు ఆఫర్లను అందిస్తుంది. ఆర్టీసీ రానూపోనూ టికెట్లను ముందుగా రిజర్వేషన్ చేసుకున్నట్లయితే చార్జీలో డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే సీనియర్ సిటీజన్స్ టికెట్ లో 25 శాతం రాయితీ కల్పించింది. ప్రజలను ఆకర్షితులు గావించేందుకు ఇలా చాలా ఆఫర్లను కల్పిస్తోంది. తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త తెలిపింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే వారికి శ్రీవారి దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెంచింది. దీనికి సంబంధించిన పూర్తి వివారలను తెలుసుకుందాం..
ఇటీవల వరకు రోజు ఆర్టీసీ ప్యాసెంజర్లకు రాష్ట్ర వ్యాప్తంగా 600 టికెట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1000కి పెంచింది. బస్సు చార్జీతోపాటు దర్శనానికి రూ. 300 దర్శన టికెట్‌ను భక్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బుక్ చేసుకునే టికెట్లు ఈ నెల 15 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రయాణం, శ్రీవారి దర్శనానికి వినియోగించవచ్చు. అదనపు కోటా టికెట్ల బుకింగ్ మంగళవారం నుండి అందుబాటులోకి వచ్చినట్లు పల్నాడు జిల్లా ప్రజా రవాశాశాఖ అధికారి ఎన్.వి.శ్రీనివాసరావు తెలిపారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ www.apsrtconline.in ను సంప్రదించవచ్చు.
ఏపీఎస్ ఆర్టీసీ మాత్రమే కాదు తెలంగాణ ఆర్టీసీ కూడా తిరుమల వెళ్లే భక్తులకు రూ. 300 శ్రీఘ్రదర్శనం టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. బస్సు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే రూ. 300 దర్శన టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. తెలుగు రాష్ట్రాలతోపాటుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఆర్టీసీలు కూడా ప్రయాణికులకు టికెట్లతోపాటుగా రూ. 300 దర్శన టికెట్లు అందిస్తున్నాయి.