దసరా పండుగ పూట జగన్ సర్కార్ ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న ఓ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. దీని వల్ల 52 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి ప్రయోజనం కలనుంది. ఆర్టీసీని 2020, జనవరి 1 నుంచి ప్రభుత్వంలో విలీనం చేయగా.. తాజాగా అక్టోబర్ 1 నుంచి వారికి ప్రభుత్వ పే స్కేల్‌ను కూడా వర్తింపచేశారు. ఇందుకు గాను ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగుల కేడర్‌ను కూడా ఖరారు చేశారు.
ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు ప్రతి నెలా ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇక ఆ అప్పుల మీద వడ్డీ భారమే ఏడాదికి 350 కోట్ల రూపాయల వరకు ఉండేది. ఫలితంగా ఆర్టీసీ ఖర్చులు తడిసిమోపడయ్యేవి. ఈ క్రమంలో ఆర్టీసీని ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వం సంచనలన నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా 2020, జనవరి 1 నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. అప్పటి నుంచి సంస్థకు చెందిన 52 వేల మంది ఉద్యోగుల జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకు గాన ప్రభుత్వం నెలకు 300 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి 3,600 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోంది.
ఇక తాజాగా అమలు చేయనున్న కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపు వల్ల ప్రభుత్వంపై ఏడాదికి 360 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. అలాగనే మొత్తం 3,960 కోటల రూపాయల భారాన్ని భరించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో.. సంస్థ ఉద్యోగులకు ఇప్పటికే అనేక ప్రయోజనాలు లభిస్తుండగా.. తాజాగా పే స్కేల్ ప్రకారం జీతాలు కూటా లభించనున్నాయి.