APIIC: వైఎస్సార్ సీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) సత్తా చాటుతోంది. మౌలిక వసతుల కల్పన, ఆదాయ ఆర్జనలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. రాష్ట్ర విభజన నాటి నుంచి ఎప్పుడూ లేనట్లుగా.. 2021–22 కాలంలో ఇంజనీరింగ్ పనుల కోసం రికార్డు స్థాయిలో రూ.348.71 కోట్లు ఖర్చు చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం.. 2014 నుంచి 2022 వరకు రూ.2,079 కోట్లు ఖర్చు చేస్తే.. ఆ మొత్తంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ రూ.1,021 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇక, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడేళ్లలో మొత్తంగా రూ.1,058 కోట్లు ఖర్చు పెట్టింది. అంతేకాదు! 51 పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసింది.
రికార్డు స్థాయిలో ఆదాయ వృద్ధి..
ఏపీఐఐసీ మౌలిక వసతుల కల్పనలోనే కాకుండా ఆదాయ ఆర్జనలో కూడా సత్తా చాటుతోంది. గడిచిన ఏడేళ్లుగా ఏపీఐఐసీ సగటు సంవత్సర ఆదాయం 590 కోట్ల రూపాయలు ఉండగా.. 2021–22లో ఏకంగా 656 కోట్ల రూపాయలుగా ఉంది. అదనంగా.. ఏపీఐఐసీ కడపలోని కొప్పర్తిలో 501 ఎకరాల్లో ఉన్న వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది. 7,000 ఎకరాల్లో ఉన్న వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, 2,500 ఎకరాల్లో 1,500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న క్రిస్ సిటీ కూడా ఏపీఐఐసీ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి.
అంతేకాదు! ఉపాధి కల్పన విషయంలోనూ ఏపీఐఐసీ ఘనత సాధించింది. గత ఎనిమిదేళ్లలో ఏకంగా ఒక లక్ష మందికి పైగా ఉపాధిని కల్పించింది. ఇక, రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీఐఐసీ ఈ ఘనత సాధించగలిగిందన్నది నిర్వివాదాంశం. గత కొన్నేళ్లుగా ఏపీ సర్కార్ అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకుంది. ప్రస్తుతం కొప్పర్తి, తిరుపతి, పెద్దాపురం, విజయవాడ వంటి ప్రాంతాల్లో 20కి పైగా రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీలను నిర్మించబడుతున్నాయి.
ఇవి కూడా చదవండి: గ్రామ సచివాలయ వ్యవస్థకు మూడేళ్లు.. ప్రభుత్వం సాధించింది ఇదే!