కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చెవిరెడ్డి తండ్రి మృతి చెందారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆయన ఇంటికి వెళ్లి పరమార్శించారు. ఈ విషాదం మరిచిపోకముందే.. మరో వైసీపీ నేత ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ఆదిమూలపు థెరీసమ్మ సోమవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న.. థెరీసమ్మ.. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో.. ఆదివారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ.. ఆమె తుదిశ్వాస విడిచారు.
ఆదిమూలపు సురేష్ తల్లి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపాన్ని తెలియజేశారు. ఇక థెరీసమ్మకు ఐదుగురు సంతానం. ఇద్దరు మగపిల్లలుండగా.. వారిలో ఒకరైన ఆదిమూలపు సురేష్.. ప్రస్తుతం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక రెండో కుమారుడు డాక్టర్ సతీష్ జార్జి విద్యాసంస్థల కార్యదర్శిగా ఉన్నారు. థెరిసమ్మ మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలుగా పని చేశారు. ఆ సమయంలో.. థెరిసమ్మ ఈ స్కూల్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
ఉపాధ్యాయురాలిగా.. థెరిసమ్మ విశేష సేవలు అందించారు. అంతేకాక.. అటు కర్నూలు జిల్లాలో, ఇటు ప్రకాశం జిల్లాలోనూ అనేక విద్యాసంస్థలను నెలకొల్పి.. విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఎందరో పేద విద్యార్థులకు ఉచితంగా.. ఉన్నత విద్యను అందించి జిల్లాలో పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ క్రమంలో థెరిసమ్మ మృతితో అటు కర్నూలు ఇటు ప్రకాశం జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి.