వివాహం అంటే స్త్రీ పురుషుల మధ్య జరిగే తంతు. కానీ ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకే జెండర్‌కి చెందిన వారి మధ్య ప్రేమ, పెళ్లిల్లు ఈమధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటికి ఆమోద ముద్ర వేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు అయితే.. తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాలను అంగీకరించేవారు కాదు. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వారిని కొట్టడం, తిట్టడం, భయపెట్టి ఎలానో అలా వారి మనసు మార్చే ప్రయత్నం చేసేవారు. మరి కొందరు అలాంటి బిడ్డల్ని వదిలేసుకునేవారు. కానీ ప్రసుత్తం తల్లిదండ్రులు కూడా మారిపోయారు. పిల్లల సంతోషమే ముఖ్యం అనుకుంటున్నారు. అందుకే గే వివాహాలను అంగీకరిస్తున్నారు. అయితే పెళ్లికాని యువకులు, యువతలు ఇలా గే వివాహాలు చేసుకుంటే అది వారి ఇద్దరి జీవితాలకు సంబంధించిన సంఘటన మాత్రమే అవుతుంది.
కానీ వివాహమైన స్త్రీ, మరో యువతిని పెళ్లి చేసుకుంటే అది రెండు కుటుంబాల సమస్య అవుతుంది. కడపలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. పెళ్లైన ఏడాదికే.. భర్తతో మనస్పర్థల కారణంగా.. మరో మహిళను వివాహం చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు, పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన వ్యక్తితో ఏడాది కిందట వివాహమైంది. అయితే పెళ్లైన నాటి నుంచి వారి మధ్య మనస్పర్థలున్నాయి. తరచుగా గొడపవడేవారు.
ఈ క్రమంలో సదరు మహిళకు తమ బంధువైన వేంపల్లె రాజీవ్ కాలనీకి చెందిన మరో మహిళతో పరిచయమేర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. భర్తతో మనస్పర్థల కారణంగా సదరు మహిళ.. తను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవాలని భావించింది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం వీరిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వివాహం చేసుకున్నారు. అనంతరం మంగళవారం వేంపల్లె పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళలు.. తాము వివాహం చేసుకున్నామని.. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. సీఐ సీతారామిరెడ్డి వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి, వారి బంధువులను పిలిపించి అప్పగించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.