నిన్ననే ఆ చిన్నారి పుట్టినరోజు. నిండు నూరేళ్లు చల్లగా బతకమని తల్లిదండ్రులు ఆశీర్వదించారు. జీవితాంతం తోడుగా ఉంటానని అన్న చెల్లికి భరోసా ఇచ్చాడు. అయితే ఆ సంతోషాన్ని చూసి విధికి కన్ను కుట్టింది ఏమో. తెల్లవారే సరికి.. వారి జీవితాలు తెల్లారిపోయాయి. చావులోనూ చిన్నారుల రక్త సంబంధం విడిపోలేదు. ఆ వివరాలు..
నిన్న అనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం. ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకున్నారు. ఆ కుటుంబంలో రెట్టింపు సంతోషం.. కారణం.. ఉగాది నాడే.. ఆ ఇంటి మహాలక్ష్మి పుట్టిన రోజు. కుటుంబ సభ్యులంతా అర్థరాత్రి వరకు మెలకువగా ఉండి బర్త్‌డే వేడుకలు జరుపుకున్నారు. ఎంతో సంతోషంగా గడిపి.. ఆనందంగా నిద్ర పోయారు. అయితే అదే ఆ చిన్నారికి ఆఖరి బర్త్‌డే అవుతుందని ఎవరు ఊహించలేదు. సంబరంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని.. అందరూ సంతోషంగా నిద్రపోయారు. అయితే ఆ చిన్నారిపై విధి పంజా విసిరింది. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో.. ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చెల్లితో పాటే నేను అనుకున్నాడేమో.. చావులోనూ రక్త సంబంధం విడవకుండా.. అన్న కూడా మృత్యువాత పడ్డాడు. ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే.. మూడు నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఈ విషాదకర సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
తెల్లవారుజామున విశాఖపట్టణం.. భయంతో ఉలిక్కిపడింది. జనాల ఆర్తనాదాలు, రోదనలు మిన్నంటాయి. కారణం ఏంటంటే.. విశాఖ కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో బుధవారం అర్ధరాత్రి సమయంలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిని చోటు, సాకేటి అంజలి, సాకేటి దుర్గ ప్రసాద్‌గా గుర్తించారు. వీరిలో అంజలి పదోతరగతి చదువుతోంది.. ఆమె సోదరుడు దుర్గ ప్రసాద్ ఇంటర్ చదువుతున్నాడు. విషాదం ఏంటంటే.. నిన్న అంజలి పుట్టిన రోజు. బుధవారం నాడు ఎంతో సంతోషంగా కనిపించిన ఆ చిన్నారుల జీవితాలు.. తెల్లవారే సరికి తెల్లారిపోయాయి.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కొమ్మిశెట్టి శివశంకర్, సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణిగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉన్నట్లు తెలిసింది. ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండే విజయవాడకు చెందిన కొమ్మిశెట్టి శివశంకర్ నూడిల్స్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. వారం క్రితమే ఆయన ఈ ఇంట్లో చేరాడు. గాయపడ్డ వారికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి