తల్లిదండ్రులు తాము జీవితంలో సాధించలేని విజయాల్ని.. ఉద్యోగాలను తమ బిడ్డలు సాధించాలి అని కోరుకుంటారు. పిల్లలు అర్థం చేసుకుని.. వారి ఇష్ట పూర్తిగా తల్లిదండ్రుల కలలు నెరవేరిస్తే సంతోషమే. కానీ బిడ్డల ఇష్టాలతో సంబంధం లేకుండా… తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లల మీద రుద్దడం కరెక్ట్ కాదు. కానీ కొందరు బిడ్డలు.. తల్లిదండ్రుల కలలని అర్థం చేసుకుని.. వాటిని సాకారం చేసేందుకు కృషి చేస్తారు.. విజయం సాధిస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్థిక కష్టాల వల్ల తండ్రి చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. చదువు విలువ తెలుసు కనుక.. ఎంత కష్టమైనా సరే బిడ్డలను బాగా చదించాలని భావించాడు. తండ్రి కలను, ఆశను అర్థం చేసుకున్న ఆ యువతి.. కష్టపడి చదివి.. భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించి.. తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది. బిడ్డ సాధించిన విజయం చూసి ఆ తండ్రి గర్వంతో పొంగిపోతున్నాడు. ఆ వివరాలు..
విశాఖపట్నానికి చెందిర రేపాక ఈశ్వరి ప్రియ ఏడాదికి 84 లక్షల రూపాయలకు పైగా ప్యాకేజీ వచ్చే ఉద్యోగం సాధించి.. రికార్డు సృష్టించింది. ఈశ్వరిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి శ్రీనివాసరావు ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్‌లు అమ్ముకునే చిరు వ్యాపారి కాగా.. తల్లి రాధ గృహిణి. శ్రీనివాసరావుకు కుమారుడు సందీప్, కుమార్తె ఈశ్వరి సంతానం. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల శ్రీనివాసరావు చదువుకోలేకపోయాడు. ఆ బాధ ఆయనలో అలానే ఉండి పోయింది. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. తన బిడ్డలను మాత్రం బాగా చదివించాలని నిర్ణయించుకున్నాడు.
తనకు చదువు అంటే ఎంతిష్టమో పిల్లల ముందు పదే పదే చెప్పేవాడు శ్రీనివాసరావు. పరిస్థితులు అనుకూలించక తాను చదువుకోలేదని.. మీరైనా బాగా చదువుకోవాలని పిల్లలకు చెప్పేవాడు. శ్రీనివాసరావు కుమారుడు సందీప్, కుమార్తె ఈశ్వరి ప్రియలపై తండ్రి మాటలు బాగా ప్రభావం చూపాయి. తండ్రి చెప్పినట్లుగానే వారిద్దరూ బాగా చదువుకున్నారు. కుమారుడు సందీప్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె ఈశ్వరి తాజాగా అట్లాషియన్ కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది.
ఈశ్వరీ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. టెన్త్, ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యింది. ఎంసెంట్‌లో కూడా మంచి ర్యాంక్ సాధించి.. ఏయూలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యింది. కంప్యూటర్ సైన్స్‌లో చేరింది. సందీప్ కూడా చెల్లిని బాగా ప్రోత్సాహించేవాడు. ఇక ఈశ్వరీ బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉండగా.. మోర్గాన్ స్టాన్లీ కంపెనీలో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేయగా.. సెలక్ట్ అయ్యింది. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌లో ఆమెకు నెలకు రూ.87 వేలు స్టైఫండ్ వచ్చేది. ఇంటర్న్‌షిప్ పూర్తవ్వగానే మోర్గాన్ స్టాన్లీ కంపెనీ ఏడాదికి 28.7 లక్షల రూపాయల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసింది. ఆతర్వాత ఈశ్వరి అమెజాన్ సంస్థ నిర్వహించి కోడింగ్ టెస్ట్‌లోనూ సెలక్టయ్యింది. ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే ఈశ్వరి అట్లాషియన్‌లో భారీ ప్యాకేజీతో కొలువు సాధించింది.
అట్లాషియన్ కంపెనీ ఏకంగా ఏడాదికి 84.5 లక్షల రూపాయల ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఈ ఉద్యోగం కోసం దేశవ్యాప్తంగా 30 వేల మంది పోటీ పడగా.. 300 మందిని ఫైనల్ పోటీలకు ఎంపిక చేశారు. వీరికి రకరకాల పరీక్షలు నిర్వహించారు. చివరకు పది మందిని ఉద్యోగాలకు.. చదువుకుంటున్న మరో పది మందిని ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేశారు. ఈ ఉద్యోగానికి ఏపీ నుంచి సెలక్టయిన ఏకైక వ్యక్తి ఈశ్వరినే కావడం విశేషం. కుమార్తె ఇంత మంచి కొలువు సాధించడమే కాక.. వర్క్ ఫ్రం హోం కావడంతో.. తమ కళ్ల ముందే బిడ్డ ఉద్యోగం చేసుకుంటుంది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈశ్వరి తల్లిదండ్రులు. మరి తండ్రి కల నెరవేర్చిన ఈశ్వరి విజయం చూసి మీరెలా ఫీలవుతున్నారు.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.