ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగులు ఎంత అసంతృప్తిగా ఉన్నారో.. ‘చలో విజయవాడ’ కార్యక్రమంతో అర్థం అయ్యింది. ఉద్యోగులను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించి కూడా విఫలం అయ్యింది. అయితే ఉద్యోగుల నిరసన సమయంలో అక్కడక్కడా కాస్త ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా.. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి మీద విమర్శలు చేశారు. సజ్జల ఎవరని ఉద్యోగులు ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది.
ఇదే కాక ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనక సజ్జల పాత్ర ఎంతో కీలకం అని వార్తలు వినిపిస్తాయి. సజ్జల పాత్ర ఎంత ముఖ్యం అంటే.. భవిష్యత్తులో ఏ కారణం చేతనైనా జగన్ సీఎం బాధ్యతల నుంచి తప్పుకుంటే.. తదుపరి సీఎం సజ్జలనే అనేంతగా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఆయన షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గతంలో హైకోర్టు సలహాదారుల విధులు ఏమిటీ? వాళ్లు రాజకీయాలు మాట్లాడొచ్చా? అని ప్రశ్నించి సలహాదారుల విధివిధానాలపై ప్రభుత్వం నుంచి స్పష్టతను కోరింది అంటే సజ్జల ఎంతలా ప్రభుత్వ అంశాల్లో జోక్యం చేసుకుంటారో అర్థం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : ‘చలో విజయవాడ’ సక్సెస్ అవ్వడానికి వారే కారణమా..?
జగన్ కి సజ్జలపై ఎందుకంత నమ్మకం
ప్రస్తుతం అధికార పార్టీ తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ గట్టిగా మాట్లాడేవాళ్లు ఎవరూ లేకపోవడం ఇబ్బందిగా మారింది. నోటికి ఎంతోస్తే అంతే మాట్లాడే నాయకులున్న పార్టీలో ఆచితూచి వివాదాలకు తావివ్వకుండా మాట్లాడే సజ్జలలాంటి నాయకుల అవసరం ఉందని సీఎం జగన్ భావన. అందుకే ఆయనకు అంత ప్రధాన్యత ఇస్తున్నారని.. కుదిరితే ఆయనను ఎమ్మెల్సీ చేసి.. మంత్రి వర్గంలోకి తీసుకోవాలని జగన్ ఆలోచన ఆయన సన్నిహితులు చెప్తుంటారు. అంతేకాక సజ్జలకు నాలుగు దశాబ్దాల పాటు జర్నలిజంలో పనిచేసిన అనుభవం ఉంది. ప్రతి అంశం గురించి.. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల పట్ల ఆయనకు ఎంతో అవగాహన ఉందని.. అందుకే ఆయనకు అంత ప్రాధాన్యత అని ఆయన సన్నిహితులు చెప్పుకుంటారు.
అందుకే ఉద్యోగులకు టార్గెట్ అయ్యారా..?
సీఎం జగన్ పాదయాత్ర సమయంలో అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లుగా సీపీఎస్ విధానం రద్దు హామీపై వైసీపీ సర్కార్ ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి సీపీఎస్ రద్దు సాధ్యం కాదని చెప్పేశారు. సీపీఎస్ విధానం రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ పరిధిలోకి ఉద్యోగుల్ని తీసుకురావాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని తేల్చేశారు. సాంకేతిక అంశాలు తెలియకుండా హామీ ఇచ్చామని, సీపీఎస్ రద్దు అసాధ్యమని వెల్లడించారు. సజ్జల ప్రకటన వల్ల వైసీపీ సర్కార్ పై ఉన్న భారం కాస్తా దిగిపోయింది. సజ్జల అసలు విషయం చెప్పేయడం ద్వారా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసినట్లయిందన్న వాదన వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి : ఉద్యోగ సంఘాలపై సజ్జల ఆగ్రహం.. బలప్రదర్శన సరికాదు
సజ్జల ప్రకనటతో సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల్లో ఉన్న చివరి ఆశలు కూడా అడుగంటిపోయాయి. నిన్న మొన్నటి వరకూ సీపీఎస్ పై పోరాటం చేస్తామని చెప్పిన ఉద్యోగ సంఘాలు… ఇప్పుడు సజ్జల వ్యాఖ్యలతో ఏం చేయాలో తెలియని అయోమయ స్ధితిలో పడిపోయాయి. ఇక ఉద్యోగులు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. దానికి తోడు పీఆర్సీపై కూడా సజ్జల ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో.. ఉద్యోగులు ప్రభుత్వాన్ని పక్కన పెట్టి సజ్జలను టార్గెట్ చేశారు. మరి ఈ వివాదానికి ఎలాంటి ముగింపు లభిస్తుందో చూడాలి.