ఆస్తులు, బంగారం, ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకునే వారి గురించి విన్నాం. కానీ ఏకంగా గ్రామాన్నే తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న వారి గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదా అయితే ఈ వార్త చదవండి. ఈ వింత సంఘటన ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, పుల్లల చెరువు మండలం, సిద్ధనపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. దీని గురించి ఆ ఊరికి చెందిన మహిళలు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
త్రిపురవరం రెవెన్యూ పరిధి సిద్ధినపాలెం గ్రామానికి చెందిన మహిళలు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న దాని ప్రకారం.. ఈ గ్రామం మొత్తం సర్వే నంబర్ 296లో ఉంది. పూర్తి విస్తీర్ణం 8.34 ఎకరాలు. అయితే అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చెరో నాలుగు ఎకరాల చొప్పున ఆన్ లైన్ చేసేసుకున్నారు. తమ భూమి అని చెప్పుకుని.. యర్రగొండపాలెం పీడీసీసీ బ్యాంక్ లో రుణం తీసుకున్నారు. దీని గురించి గ్రామస్తులకు తెలియడంతో.. ఆ ఊరి మహిళలు ఇద్దరు వ్యక్తులతో పాటు వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల ఉప తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.