మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో ఫించన్ పంపిణీ చాలా మెరుగ్గా ఉంది. స్వయంగా వలంటీర్లే ఇంటికి వచ్చి.. ఫించన్ అందించి వెళ్తారు. ప్రతి నెల 1న ఫించన్ తప్పకుండా ఇస్తారు. అయితే ఏప్రిల్ నెలలో మాత్రం ఫస్ట్‌కు ఫించన్ ఇవ్వడం లేదంట. ఎందుకు అంటే..
వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిలళకు అండగా నిలవడం కోసం ప్రభుత్వం ప్రతి నెల వారికి పెన్షన్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే వలంటీర్లు.. ప్రతి నెలా 1వ తారీఖున ఉదయం ఇంటికే వచ్చి వైఎస్సార్ పింఛను కానుక కింద అందించే పెన్షన్‌ను అబ్ధిదారులకు స్వయంగా అందించి వెళ్తారు. అయితే ప్రతి నెలా 1న అందించే పెన్షన్.. ఈ సారి అనగా ఏప్రిల్‌లో కాస్త ఆలస్యం అవుతుంది అంటున్నారు అధికారులు. ఏప్రిల్ 1న ఇవ్వాల్సిన పెన్షన్‌ను 3 నుంచి పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుండగా.. 2న ఆదివారం అయినందున బ్యాంకులు పని చేయవని.. అందుకే 3నుంచి పింఛను పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తెలిపారు. పింఛన్ తీసుకునేవారు ఈ మార్పును గమనించాలని కోరారు.
ఇక తాజాగా ఈ ఏడాదికిగాను అనగా 2023 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జగన్ సర్కార్ పింఛన్లకు భారీగా కేటాయింపులు చేసింది. అలానే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి తగినట్లుగా.. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1, 2023 నుంచి ప్రభుత్వం.. వివిధ కేటగిరీలలోని 64.45 లక్షల మంది పింఛనుదారులకు వైఎస్సార్ పింఛన్ కానుక కింద నెలకు ఇచ్చే మొత్తాన్ని రూ.2,750కు పెంచింది. అలాగే ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఈ పింఛన్‌ను త్వరలోనే రూ.3,000 పెంచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ తెలిపారు. పింఛన్ల కోసం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌లో రూ.21,434 కోట్లు కేటాయింపుల్ని ప్రతిపాదించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
అలానే పింఛన్ తీసుకునేవారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎవరైనా సరే.. తమ పింఛన్‌ను ఓ చోట నుంచి మరొక చోటకి మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకుగాను లబ్ధిదారులు తమ వివరాలతో సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. అలానే రాష్ట్రంలో అర్హత లేని వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు. రాష్ట్రంలో నిబంధనల ప్రకారమే పింఛన్ మంజూరు చేయాలని.. ఒకవేళ ఎవరైనా అనర్హులకు పింఛన్ ఇస్తే.. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అనర్హులకు పింఛన్ మంజూరు చేస్తే.. ఆ డబ్బును మంజూరు చేసిన వారి నుంచి రికవరీ చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.