ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని పెద్దగా మీడియా ముందుకు రారు. తన పనేంటో తాను చూసుకుంటారు. అలాంటిది ఆమె స్టేజీ మీద మాట్లాడుతూ... అందరి ముందు కన్నీరు పెట్టుకుంది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో మరో సరికొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా అడుగులు వేశారు. దీనిలో భాగంగా.. పల్నాడు జిల్లా.. చిలుకలూరిపేట లింగంగుంట్ల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ప్రజలకు ఏ విధంగా మేలు చేకూరుస్తోందో వివరించారు. అలానే వేదిక మీదుగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. అనంతరం ఏపీ వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్టేజీ మీదే కంటతడి పెట్టకున్నారు. ఆ వివరాలు..
విడదల రజని మాట్లాడుతూ.. ‘‘సాధారణ బీసీ మహిళ అయిన నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు ఏకంగా మంత్రిని చేశారు. నా రాజకీయ జీవితం, పదవులు, రాజకీయ భవిష్యత్తు..’’ అని సీఎం జగన్ పెట్టిన భిక్షే అంటూ ప్రసంగిస్తూ.. భావోద్వేగంతో కన్నీరు పెట్టకున్నారు విడదల రజిని. స్టేజీ మీద మాట్లాడుతూనే ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
అనంతరం విడదల రజిని మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆశయాలే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు. భారతదేశ ఆత్మ గ్రామ సీమల్లోనే ఉందని.. పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు అని చెప్పిన మాటలను సీఎం జగన్ బలంగా నమ్ముతారని వెల్లడించారు. దానిలో భాగంగానే.. వలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చారని.. నేడు వలంటీర్లు.. అందరికి ఆత్మబంధువులుగా మారారని తెలిపారు. మహానగరాల్లో ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ అనే మాట వినపడుతుందని.. కానీ ఇక మీదట గ్రామాల్లో ఉండే వారి కోసం కూడా ఫ్యామిలీ డాక్టర్ ఉండబోతున్నారని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం వినూత్నం, విలక్షణమైదని వర్ణించారు.