ఆంధ్రప్రదేశ్ నూతన క్యాబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా రోజాకు ప్రమాణ స్వీకారం చేసి నూతన బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆమె శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజాకు వింత అనుభవం ఎదురైంది. తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె మధ్యాహ్నం పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు.
పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకున్న తర్వాత మంత్రి రోజాకు పలువురు అధికారులు, వైసీపీ నేతలు సన్మానించేందుకు పోటీ పడ్డారు. దీంతో అక్కడ జన సందోహం బాగా పెరిగిపోయింది. ఇదే అదునుగా ఓ దొంగ ఏకంగా రోజా సెల్ ఫోన్ కొట్టేశాడు. తన సెల్ ఫోన్ కనిపించకపోవడంతో రాజా ఒక్కసారే కంగారు పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగ ఫోన్ కొట్టేసిన తర్వాత కారు ఎక్కేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
కారు నెంబరు ఆధారంగా పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదే విధంగా సెల్ ఫోన్ సిగ్నల్ ని ఆధారంగా చేసుకొని సదరు దొంగ దగ్గరలోని రుయా హాస్పిటల్ వద్ద ఉన్నట్లు గుర్తించి వెంటనే అక్కడికి వెళ్లి దొంగను పట్టుకున్నారు. గెస్ట్ హౌజ్ లో కాంట్రాక్ట్ వర్క్ చేసే ఉద్యోగి అని తేలింది. మొత్తానికి తన ఫోన్ దొరకడంతో సంతోషించారు మంత్రి రోజా.