ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇరు పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగుతున్నారు. ఏపిలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా ఇటీవల మంత్రి హూదా లభించింది. మొదటి నుంచి టీడీపీ అంటే మండిపడే మంత్రి రోజా తాజాగా మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవలేని లోకేష్ చీర కట్టుకుంటే బాగుంటుంది.. ఏ చీర కావాలో తేల్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా.
ఇదే సందర్భంగా బాలకృష్ణ ను కూడా ఆమె టార్గెట్ చేశారు. గతంలో ఓ ఈవెంట్ లో మహిళ కనిపిస్తే వాటేసుకోవాలి అని చంద్రబాబు వియ్యంకుడు అనలేదా ఈ విషయం గుర్తు ఉందా అని ప్రశ్నించారు. మహిళల పట్ల ఎంతో గౌరవం అంటూ ఇప్పుడు గొప్ప నాటకాలు ఆడుతున్నారని.. ఒకప్పుడు టీడీపీ పరిపాలనలో ఎంతో మంది మహిళలు అవస్థలు పడ్డారని ఆమె అన్నారు. విజయవాడ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలికి పరామర్శ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని.. ఇది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ఏపీ సీఎం జగన్ దమ్మున్నోడు కనుకనే తాడే పల్లిలో ఇంటిని నిర్మించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలనేది ఆయన లక్ష్యం. కానీ చంద్రబాబు మాత్రం దొంగలా కరకట్టలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. మహిళల రక్షణ కోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకువచ్చామని మంత్రి రోజా తెలిపారు. ఇప్పుడు ఏపిలో ప్రతి మహిళా ఎంతో ధైర్యంగా తలెత్తి తిరుగుతుందని.. అది జగన్ చలువే అని అన్నారు. అందుకే ప్రజలు సీఎం జగన్ పై ఎంతో నమ్మకాన్ని పెంచుకున్నారని అన్నారు.