ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు దక్కించుకున్నారు మంత్రి రోజా. సినిమాల్లోనే కాక.. బుల్లితెర, ఇటు రాజకీయాల్లో కూడా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తూ.. ఏ రంగంలో అయినా సరే తనకు తిరుగులేదు అనిపించుకుంటున్నారు రోజా. వైసీపీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు రోజా. ప్రస్తుతం ఏపీ టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి రోజాకు మరో పదవి దక్కింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రోజాకు అవకాశం లభించింది. శాయ్ పాలకవర్గ సభ్యురాలిగా మంత్రి ఆర్కే రోజా నియమితులయ్యారు.
కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి అధ్యక్షుడిగా కొనసాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యవర్గంలో సభ్యులుగా.. పాలకవర్గ పునర్నియామకంలో భాగంగా సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల క్రీడల శాఖ మంత్రులకు చోటు దక్కింది. రొటేషన్ పద్ధతిలో వివిధ రాష్ట్రాల మంత్రులను పాలకవర్గ సభ్యులుగా నియమిస్తున్నట్లు శాయ్ పేర్కొంది. అయితే ఈసారి శాయ్ పాలకవర్గ సభ్యులుగా ఐదు రాష్ట్రాల క్రీడా శాఖ మంత్రులకే అవకాశం లభించగా.. ఏపీ నుంచి మంత్రి రోజాకు ఆ అవకాశం దక్కింది. మరో విషయం ఏంటంటే.. దక్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం రోజాకు మాత్రమే అవకాశం దక్కింది. తనకు వచ్చిన ఈ అవకాశంపై ఏపీ రోజా ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఇక సినిమాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజా.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలుత టీడీపీ తరఫున 2004, 2009 శాసనసభ ఎన్నికలలో.. నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేశారు. కానీ ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలో వైసీపీ తరఫున నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఇక 2019 శాసనసభ ఎన్నికల్లో ఆమె రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2022 ఏప్రిల్ 11న జరిగిన ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తాజాగా శాయ్ పాలకవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. మరి మంత్రి రోజాకు లభించిన పదవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.