దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివిటీ రేటు 19.65 శాతానికి పెరిగింది. రోజువారీ కేసుల్లో పెరుగుదల భయాందోళనకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సెలవులను జనవరి నెలాఖరు వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారని భావించారు. కానీ, అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతాయని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.
‘ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగింతే ఆలోచన లేదు. గతంలో చెప్పిన విధంగానే సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. విద్యార్థుల ఆరోగ్యంతో పాటు వారి భవిష్యత్ కూడా మాకు ముఖ్యమే. ఉపాధ్యాయులకు ఇప్పటికే వ్యక్సినేషన్ పూర్తయ్యింది. 15-18 సంవత్సరాల మధ్య విద్యార్థుల్లో 92 శాతం మందికి టీకా ఇచ్చాం. వారి ఆరోగ్యం విషయంలో ఎంతో నిఘా ఉంచాం. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు అనుసరించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. భవిష్యత్ లో కేసుల పెరుగుదల ఉంటే ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తాం’ అంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
మరోవైపు ఏపీలో ఈనెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు కానుంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. పాఠశాలల విషంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.