ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్, రేషన్ తీసుకునే వారికి ముఖ్యమైన అలర్ట్. ఈ విషయం తెలుసుకోకపోతే ఇబ్బంది తప్పదు. ప్రస్తుతం ఏపీలో పెన్షన్, రేషన్ ఇంటికే వచ్చి అందజేస్తున్నారు. అయితే శనివారం అనగా ఏప్రిల్ 8న దీనికి బ్రేక్ పడనుంది. కారణం ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వినూత్న మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రజల సంక్షేమం కోసం రకరకాల పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ, పెన్షన్ పంపిణీ వంటివి. ఈ కార్యక్రమాలపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు పెన్షన్ కోసం గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడే అవసరం లేకుండా.. ఇంటి వద్దకే వచ్చి అందజేస్తుండం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏప్రిల్ నెలలో పెన్షన్ పంపిణీ రెండు రోజులు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3న పెన్షన్ అందజేయనున్నారు. అలానే రేషన్ తీసుకునేవారికి కూడా ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. శనివారం అనగా ఏప్రిల్ 8న రేషన్ పంపిణీ ఉండకపోవచ్చనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే..
ఏపీలో ఇంటి వద్దకే వచ్చి రేషన్ పంపిణీ చేయడానికి ప్రత్యేక వాహనాలు ఉన్నాయి. అయితే ఈ వాహనాలు శనివారం నిలిచిపోనున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వాహనాల ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. వాహన బీమాకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని. కానీ బ్యాంకు అధికారులు మాత్రం.. ఒక్కో ఎండీయూకు రూ.18-రూ.23వేల వరకు మినహాయించుకుంటున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. శనివారం రేషన్ పంపిణీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎండీయూలు నిలిచిపోవడంతో రాష్ట్రంలో ఇంటింటికి రేషన్ సరఫరా కూడా నిలిచిపోనుంది అనే వార్తలు వస్తున్నాయి.
ఎండీయూలు ఆగిపోవడంతో డీలర్ల ద్వారా పంపిణీ చేస్తారా లేదా అన్న దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ మాత్రం.. రేషన్ పంపిణీకి ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపారు. వాహన బీమాతో పాటు ఇతర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఏపీ సమైక్య ఎండీయూ ఆపరేటర్ల యూనియన్ తెలిపింది. ఈ క్రమంలోనే శనివారం వాహనాల ద్వారా రేషన్ పంపిణీ నిలిపేస్తామని తెలిపారు. అలాగే గుండెపోటుతో, అనారోగ్యంతో చనిపోయిన 57 మంది ఆపరేటర్ల కుటుంబాలకు బీమా సదుపాయం కల్పించాని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఆపరేటర్లు అందరికీ ప్రమాద బీమా కల్పించాలని.. ప్రతి బస్తా బియ్యాన్ని కచ్చితమైన తూకం వేసి ఎండీయూలకు ఇవ్వాలి అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.