ఆంధ్రప్రదేశ్ మంగళగిరి తహసీల్దార్‌కు అరుదైన అవకాశం లభించింది. ఆయనకు వచ్చిన అవకాశాన్ని తలుచుకుని అదృష్టంగా భావిస్తున్నారు. ఇంతకు ఏంజరిగింది అంటే..
ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా మంగళగిరి తహసీల్దార్‌కు అరుదైన అవకాశం, అదృష్టం లభించింది. తన సర్వీస్ కాలంలో ఒకేసారి ఏకంగా 35 వేలకు సైగా సంతకాలు చేసే అవకాశం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాడు సదరు తహసీల్దార్. అన్ని సంతకాలు ఎందుకు అంటే.. అమరావతిలోని ఆర్-5 జోన్‌లో నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఎర్రబాలెం, కురగల్లు పరిధిలో ఉన్న పేదలకు.. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సెంటు భూమి చొప్పున పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఒకేసారి ఇళ్లపట్టాలపై 35 వేలకుపైగా సంతకాలు చేసినట్లు తహసీల్దార్ రామ్‌ప్రసాద్ తెలిపారు. అంతేకాదు త్వరలోనే ఆయన 35 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకోబోతున్నారు. ఇలా ఉండగానే ఒకేసారి ఇళ్ల పట్టాల కోసం 35 వేల సంతకాలు చేసే అవకాశం రావడం మరింత సంతోషంగా ఉంది అన్నారు.
రామ్‌ప్రసాద్‌కు ఒకేసారి ఏకంగా 35 వేల పైచిలుకు ఇళ్లు పట్టాల పంపిణీకి సంతకం చేసే అవకాశం దక్కడం ప్రసుత్తం మాత్రం నిజంగా గ్రేటే అంటున్నారు ఈ వార్త తెలిసిన జనాలు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పట్టాల్లో ఎక్కువ శాతం మంగళగిరి మండలంలో ఉండటంతో లబ్ధిదారుల పట్టాలపై మంగళగిరి తహసీల్దార్ రామ్‌ప్రసాద్ 35 వేలకు పైగా సంతకాలు చేశారు. తన సర్వీసులో ఇలా 35వేలకు పైగా లబ్ధిదారుల పట్టాలపై ఏకకాలంలో సంతకాలు చేయడం తన అదృష్టం అన్నారు రామ్ ప్రసాద్.
ఇక రాజధాని గ్రామాల్లో గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలను ఈ నెల 26న పంపిణీ చేయనున్నారు. వెంకటపాలెం సమీపంలో వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట నిర్వహించే బహిరంగ సభలో.. సీఎం జగన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఈ ఇళ్ల పట్టాలు అందించనున్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు తమ రిజిస్ట్రేషన్ పత్రాలతో ఈ నెల 26న సీఎం సభకు రావాలని సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం తెలిపింది. ఒకవేళ సందేహాలుంటే సీఆర్డీఏ ఫెసిలిటేటర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.