విద్యార్థి దశ.. అంటే ఎంత అందంగా ఉండాలి. భవిష్యత్తు ఏంటి.. ఏ మార్గంలో పయనిస్తే.. ఉన్నత శిఖరాలను చేరుకుంటాం.. అసలు జీవితంలో ఎలా ముందుకు సాగాలో నేర్చుకునే దశ. కానీ మరి నేటి విద్యార్థులు ఎలా ఉన్నారు. అసలు జీవితమంటే వారికి అర్థం తెలుసా అనిపించకమానదు కొన్ని సంఘటనలు చూస్తే.. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. ఇలానే అనిపిస్తుంది. ఆ వివరాలు..
వారందరిది చాలా చిన్న వయసు. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండలేదు. పసితనపు ఛాయలు ఇంకా వాడిపోలేదు. జీవితంలో ఎటు వెళ్లాలో… ఏ మార్గంలో పయనించాలో.. నిర్ణయించుకోవాల్సిన కూడలిలో నిలబడ్డారు. కానీ తడబాటు కారణంగా.. ఓడిపోయారు. దాంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. 17 ఏళ్ల ప్రాయంలోనే వారికి నిండి నూరేళ్లు నిండాయి. ఏమంత జీవితం చూశారని ఇంత దారుణ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా.. తల్లిదండ్రలు కడుపులో మాత్రం ఆరని చిచ్చు రగిల్చారు. కన్నవారికి ఇవ్వకూడని బహుమతి కడుపుకోతను గిఫ్ట్ ఇచ్చి.. వారి దారి వారు చూసుకున్నారు. ఇక ఆ తల్లిదండ్రులు జీవితాంతం కన్నీటి సంద్రాన్ని ఈదాలి. రాష్ట్రంలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోన్నారు. ఈ దారుణంతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కిపడింది. ఆ వివరాలు..
మిగతా దేశాలతో పోలిస్తే.. మన దేశంలో చదువు పేరు చెప్పి పిల్లల మీద వారు మోయలేని భారం పెడుతున్నాం. బాగా చదవాలి.. ర్యాంకులు తెచ్చుకోవాలి. ఫెయిల్ అనే మాట పిల్లల జీవితంలో ఉండకూడదు అనుకుంటున్నాం. అసలు చదువు పేరుతో వారి బుర్రలోకి ఏం ఎక్కిస్తున్నాం.. జీవితాన్ని చదవగలిగే తెలివితేటలు, పరిస్థితులను తట్టుకుని ధైర్యంగా నిలబడగలిగే విధంగా వారిని తయారు చేస్తున్నామా అన్న ప్రశ్నకు.. లేదన్న సమాధానమే వినిపిస్తుంది. ఫలితం పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇక జీవితమే లేదనే భ్రమలో.. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడుస్తున్నారు.
ఇక తాజాగా ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షల్లో పాస్ కాలేదని.. మార్కులు తక్కువ వచ్చాయంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 9 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఇద్దరు బలవన్మరణానికి యత్నించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఏటవాకిలికి చెందిన అనూష అనే విద్యార్థిని.. ఇంటర్‌లో ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య చేసుకుంది. అలానే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెకు చెందిన కృష్ణప్ప కుమారుడు బాబు(17) ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఈయర్‌లో లెక్కల సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు బాబు.
ఇంటర్ ఫస్ట్ ఈయర్‌లో తక్కువ మార్కులు వచ్చాయనే ఆవేదనతో అనకాపల్లికి చెందిన కరుబోతు తులసీ కిరణ్(17) గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్షలో ఫెయిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నానికి చెందిన ఆత్మకూరు అఖిలశ్రీ(16) , విశాఖ నగరంలోని పల్నాటి కాలనీ శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న బోనెల జగదీష్(18), అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని హనకనహాళ్ గ్రామానికి చెందిన మహేష్(17) విద్యార్థులు ఫస్టియర్, సెకండియర్‌లో ఒక్కో సబ్జెక్ట్‌లో ఫెయిల్ కావడంతో.. ప్రాణాలు తీసుకున్నారు.
అలానే ఎన్టీఆర్ జిల్లాలో నందిగామకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి షేక్ జాన్ సైదా(16)కు గణితంలో 1, ఫిజిక్స్‌లో 6, కెమిస్ట్రీలో 7 మార్కులు వచ్చాయని గురువారం ఉదయం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అధికారులు తమ కుమారుడి పరీక్ష పత్రాల మూల్యాంకనం సరిగా చేయలేదని, తమ బిడ్డ మరణానికి అధికారులే బాధ్యత వహించాలని సైదా తల్లిదండ్రులు ఆరోపించారు. ఇక అదే జిల్లాలోని చిల్లకల్లుకు చెందిన విద్యార్థి రమణ రాఘవ సీనియర్ ఇంటర్‌లో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఈయర్, సెకండ్ ఈయర్ కలిపి మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. దాంతో మనస్తాపానికి గురైన సదరు విద్యార్థి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసి ప్రాణాలు విడిచాడు.
ఇక అదే జిల్లా రాజాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి పరీక్షల్లో ఫెయిలయ్యానని గురువారం చీమల మందు తాగడంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి విద్యార్థులు ఇంతటి దారుణ నిర్ణయం తీసుకోవడానికి కారకులు ఎవరు.. తల్లిదండ్రులా, సమాజమా.. అసలు మన విద్యా వ్యవస్థలోనే లోపం ఉందా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.