ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలు రానే వచ్చాయి. ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
ఏపీ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు రానే వచ్చాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేశారు. 4.84 లక్షల మంది ఫస్టియర్ పరీక్షలు రాయగా.. 61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 5.19 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 72 శాతం మంది పాస్ అయ్యారు. రెండు సంవత్సరాల ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో బాలికలు- 65 శాతం, బాలురు- 58 శాతం ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరం ఫలితాల్లో 75 శాతం బాలికలు, 68 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు.
ఇంక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యి.. సప్లిమెంటరీ పరీక్షలు రాయాలి అనుకుంటున్న విద్యార్థులు మే 3వ తేదీలోపు ఫీజు చెల్లించాలని సూచించారు. మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 1వ తేదీ వరకు ఈ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మార్కులు తక్కువగా వచ్చాయని భావించినా? తాము రాసిన ఆన్సర్స్ కు సరైన మార్కులు రాలేదని భావించినా.. రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ పెట్టించుకునేందుకు అవకాశం ఉంటుంది. సప్లిమెంటరీ, రీవెరిఫికేషన్ కు సంబంధించిన ఫీజు వివరాలను, చెల్లింపు విధానాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఈ కింది లింక్స్ ద్వారా ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోండి.