విద్యార్థులతో పాటు వారి పేరెంట్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి. ఈసారి ఫలితాల్లో బాలికల హవా నడిచింది.
స్టూడెంట్స్‌తో పాటు వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఇవాళ సాయంత్రం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ రిజల్ట్స్‌ను విడుదల చేశారు. ఎగ్జామ్స్ ముగిసిన 22 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసి ఏపీ ఇంటర్ బోర్డు సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా నడిచింది. బాలుర ఉత్తీర్ణత శాతం పడిపోయింది. ఫలితాలను చూసుకుంటే.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 61 శాతం, రెండో సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 2.66 లక్షల మంది విద్యార్థులు పాసయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాలికలు 65 శాతం, 58 శాతం మంది బాలురు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో 75 శాతం మంది బాలికలు, బాలురు 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద చెప్పాలంటే ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి.
జిల్లాల వారీగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూసుకుంటే.. 75 శాతంతో కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేసులో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ గోదావరి (70 శాతం), గుంటూరు (68 శాతం) నిలిచాయి. సెకండ్ ఇయర్ విషయానికొస్తే.. 83 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో గుంటూరు (78 శాతం), వెస్ట్ గోదావరి (77 శాతం) నిలిచాయి. రిజల్ట్స్ మీద విద్యార్థులకు సందేహాలు ఉంటే రీకౌంటింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఏప్రిల్ 27 నుంచి మే 6వ తేదీ వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌కు మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు రెండు సెషన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ను నిర్వహించనున్నారు. ఉదయం పూట ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం సమయంలో సెకండ్ ఇయర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.