ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరుస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన పంచ్ ప్రభాకర్‌ను.. పది రోజుల్లో అరెస్టు చేయాల్సిందేనంటూ ఏపీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. సీబీఐకి 10 రోజుల గడువు మాత్రమే ఇస్తున్నట్లు ధర్మాసనం స్పంష్టం చేసింది. దర్యాప్తు కూడా సరైన మార్గంలోనే సాగుతున్నట్లు నిరూపించుకోవాల్సిందిగా ఏపీ హైకోర్టు కోరింది. విఫలమైతే దర్యాప్తు చేతకావడం లేదని భావించి సిట్‌ను ఏర్పాటు చేస్తామని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం స్పంష్టం చేసింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరుతూ నివేదిస్తామని తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేశారు. దర్యాప్తుపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించారు.
సీబీఐ తరఫున పి.సుభాష్ వాదనలు వినిపించారు. వీడియోలు తొలగించాలని గూగుల్‌కు లేఖలు రాశామని చెప్పారు. పోస్టులు పెట్టిన వాళ్లనే వీడియోలు తొలగించాలని బతిమాలుకోవాలని రిప్లై వచ్చిందన్నారు. సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. ‘ఎవరు బతిమాలమన్నారు? చేతకాకపోతే చెప్పండి.. సిట్‌ను ఏర్పాటు చేస్తాం’ అంటూ హెచ్చరించింది. నాలుగు వారాల గడువు కోరగా మూడ్రోజుల్లో అరెస్టు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ తరఫు న్యాయవాది, ఎస్పీ వేడుకోగా 10 రోజుల గడువు ఇచ్చింది.