డబ్బు విషయంలో చాలా మంది వైఖరి ఎలా ఉంటుంది అంటే.. మనం బతకాడానికి మాత్రమే కాక మన తర్వాత తరాలు వాళ్లు కూడా కూర్చుని తినగలగేంత సంపాదించాలి అని భావిస్తారు. తమ చుట్టూ పేదవారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు ఎందరు ఉన్నా.. అలాంటి వారిని ఆదుకోవడానికి ముందుకు రారు. అయితే కొందరు మాత్రం.. సమాజాన్ని తమ కుటుంబంలానే ప్రేమిస్తారు.. దాని అభివృద్ధి కోసం పరితపిస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. హాస్టల్ నిర్మాణం కోసం ఏకంగా 18 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి.. పెద్ద మనసు చాటుకున్నారు ఇద్దరు దాతలు. ఆ వివరాలు..
గుంటూరులో నిర్మించబోయే హాస్టల్ నిర్మాణం కోసం ఓ ఎన్నారై రూ.14 కోట్లు, మరో వ్యాపారవేత్త రూ.4 కోట్లు విరాళం ప్రకటించారు. గుంటూరులో కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ హాస్టల్ నిర్వహిస్తున్నారు. అయితే మరింత మంది పేద విద్యార్థినిలకు వసతి, చదువు అందించాలన్న ఉద్దేశంతో.. హాస్టల్ నిర్వాహాకులు కొత్త భవనం నిర్మించాలని భావించారు. ఈ క్రమంలో విద్యార్థినిలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో.. వారికి కావాల్సిన అన్ని వసతులతో.. హాస్టల్ నిర్మాణం చేపట్టడం కోసం 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని గుర్తించారు.
ఈ క్రమంలో విరాళాలు ఇవ్వాల్సిందిగా దాతలను కోరారు. దీనిపై స్పందించి.. నూతనంగా నిర్మించబోయే హాస్టల్ భవన సముదాయానికి ఎన్నారై నూతక్కి రామకృష్ణప్రసాదు రూ.14 కోట్లు విరాళంగా ఇస్తున్నారని.. మిగిలిన రూ.20 కోట్లు దాతల నుంచి సేకరించనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. అలానే మరో పారిశ్రామికవేత్త దండా బ్రహ్మానందం హాస్టల్ నిర్మాణానికి సుమారు రూ.4 కోట్ల విరాళం అందిస్తామని ప్రకటించారు.
ఇంత భారీ విరాళం ప్రకటించిన నేపథ్యంలో హాస్టల్ నిర్వాహాకులు.. దండా బ్రహానందాన్ని ఘనంగా సన్మానించారు. అలాగే హాస్టల్ నిర్మాణం.. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. హాస్టల్ నిర్మాణానికి ఇంత భారీ మొత్తం విరాళం అందిస్తున్న దాతలపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.