సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ.. వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ఇక తాజాగా జగన్ సర్కార్ మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలు..
సంక్షేమ పథకాలు అమలుతో పాటు.. తన ప్రభుత్వంలో అని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, పదవులు కల్పిస్తూ.. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇక తాజాగా వైసీపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయల పాలకవర్గ కమిటీలో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తూ.. జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే తొలిసారి జగన్ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు అరుదైన గౌరవం ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య ఆధ్వర్యంలో సచివాలయంలోని తన చాంబర్‌కు వచ్చిన రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘ నేతలను ఆయన సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘అనాదిగా ఆలయాల వ్యవస్థతో నాయి బ్రాహ్మణులకు విడదీయరాని బంధం ఉంది. ఆలయాల్లో భజంత్రీలుగా, క్షురకులుగా, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామివారి పల్లకీ సేవల్లో నాయీ బ్రాహ్మణులు పాలుపంచుకుంటున్నారు. ఆలయాల్లో పలు కార్యకలాపాల్లో సేవలందించే తమకు.. పాలకవర్గాల్లో చోటు కల్పించాలని నాయీ బ్రాహ్మణులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. దీనిపై గతంలోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా నాయీ బ్రాహ్మణులకు సానుకూల హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ నిర్వహించిన బీసీ గర్జన సభల్లోనూ దీనిపై ప్రత్యేకంగా చర్చ జరిగిందని, ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ దేవదాయ శాఖ చట్టానికి సవరణ తెచ్చి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది’’ అని తెలిపారు.
హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రకారం.. రూ.5 లక్షలకు పైగా ఆదాయం వచ్చే ఆలయాలకే దేవదాయ శాఖ ట్రస్టు బోర్డులను నియమించే అవకాశం ఉందని ఈ సందర్భంగా సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో అలాంటి ఆలయాలు 1,234 ఉన్నాయన్నారు. అయితే వాటిల్లో ఇప్పటికే పలు ఆలయాలకు ట్రస్టు బోర్డు నియామకాలు పూర్తయ్యాయని.. వాటిని మినహాయిస్తే.. మరో 610 ఆలయాలకు కొద్ది రోజుల్లో ట్రస్టు బోర్డులో నాయీ బ్రాహ్మణులకు స్థానం కల్పించే అవకాశం ఉందని తెలిపారు.
ఇక ప్రభుత్వ నిర్ణయంపై నాయీ బ్రాహ్మణలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో తాము అవమానాలను ఎదుర్కోగా.. నేడు తమకు సముచిత స్థానం దక్కిందని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధపటం యానాదయ్య అన్నారు. నాయీ బ్రాహ్మణులకు దేశ చరిత్రలోనే అరుదైన గౌరవం అందించడం ద్వారా జగన్ ప్రభుత్వం తమను మరో మెట్టు ఎక్కించిందని తెలిపారు. దీంతో పాటు జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో తలనీలాల టికెట్ ధర పెంచింది.
జగన్ సర్కార్ రాష్ట్రంలోని దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో తలనీలాల టికెట్ ధర పెంచింది. రూ.25 నుంచి రూ.40కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా పెంచిన సొమ్ముతో తలనీలాల విధులు నిర్వహించే క్షురకులకు కనీస కమిషన్ నెలకు రూ.20 వేల చొప్పున ఇవ్వనున్నారు. ప్రస్తుతం తలనీలాల టికెట్ ధర రూ.25 ఉంది.. ఆ మొత్తం క్షురకులకే ఇస్తున్నారు. చాలా కాలంగా ఆలయాల్లోని రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా కనీస వేతనం ఇవ్వాలని వారు కొంతకాలంగా కోరుతున్నారు.
ఈ క్షురకులకు నెలకు రూ.20 వేల కంటే తక్కువ మొత్తం కమీషన్‌గా వస్తే.. తలనీలాల విక్రయాల ద్వారా వచ్చిన రాబడి నుంచి మిగిలిన మొత్తం ఇస్తారు. ఒకవేళ అది కూడా సరిపోకపోతే ఆలయ ఆదాయంలో 3 శాతం మొత్తాన్ని కలిపేలా వీలు ఉంది. గతేడాది జనవరి ఒకటి నాటికి ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులకే ఇది వర్తిస్తుంది. అంతేకాదు ఆలయాల్లో క్షురకులకు ఏటా కనీసం 100 రోజుల విధులు ఉంటేనే ఈ కనీస కమీషన్ పథకం వర్తిస్తుంది. మరి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.