సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఏ వార్త నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాలు మొదలు.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత విషయాల వరకు.. సోషల్ మీడియాలో బోలేడు వార్తలు ప్రచారం అవుతుంటాయి. వీటిల్లో తప్పుడు వార్తలే ఎక్కువగా ఉంటాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి ఫేక్ జీవో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
సదరు ఫేక్ జీవోలో.. ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచినట్లు ఉంది. గతంలోనే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. అయితే మరోసారి ప్రభుత్వం.. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 నుంచి 65 పెంచినట్లు ఫేక్ జీవోను వైరల్ చేశారు కొందరు. ఆర్థిక శాఖ పేరుతో ఈ జీవో సర్క్యులేట్ అయ్యింది. ఈ జీవో చూసి కొందరు సంతోషం వ్యక్తం చేస్తే.. చాలా మంది మాత్రం.. ఇలాంటి నిర్ణయాల గురించి ప్రభుత్వ ప్రతికాముఖంగా ప్రకటిస్తుంది కదా.. ఇలా సైలెంట్‌గా జీవో జారీ చేయడం ఏంటి అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఫేక్ జీఓ అయ్యి ఉంటుంది అని భావించారు.
ఇక తాజాగా ప్రభుత్వం ఈ జీవోపై క్లారిటీ ఇచ్చింది. అది ఫేక్ జీవో అని స్పష్టం చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్‌పై ప్రభుత్వం ఎలాంటి జీవో జారీ చేయలేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. అది ఒరిజినల్ జీవో కాదని క్లారిటీ ఇచ్చారు. దీన్ని ఎవరు వైరల్ చేశారో ఆరా తీస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాక జీవో తయారు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. అలాగే ఈ జీవోను సర్క్యులేట్ చేస్తున్న వారిపై గుంటూరు డీఐజీకి ఆర్థిక శాఖ అధికారుల ఫిర్యాదు చేశారు. ఫేక్ జీవోని నమ్మవద్దని తెలిపారు.