జూన్ నెల సగం రోజులకు పైగా ముగిసినా ఇంకా వాతావరణం చల్లబడలేదు. వర్షాలు కురవకపోగా ఎండలు మండిపోతున్నాయి. వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉందని విద్యార్థుల ఒంటిపూట బడుల తేదీని ఇంకొన్ని రోజులకు పొడిగించారు. ఎప్పటి వరకూ ఒంటిపూట బడులు ఉంటాయంటే?
వేసవి కాలం వచ్చిందంటే ఒంటిపూట బడులు కొనసాగుతాయి. తీవ్రమైన ఎండలను విద్యార్థులు తట్టుకోలేరని పాఠశాలలను ఒక పూట మాత్రమే తెరుస్తారు. ఆ తర్వాత పరీక్షలు అయిపోయాక సెలవులు ఇస్తారు. సెలవులు అయిపోయాయంటే వర్షాలు మొదలవుతాయి. ఈపాటికి వర్షాలు పడాలి. కానీ ఈ ఏడాది మాత్రం వర్షాలు పడడం లేదు. పైగా ఎండల తీవ్రత మరీ ఎక్కువైపోయింది. కానీ ఏపీలోని పాఠశాలలు జూన్ 12 నుంచే పునఃప్రారంభమయ్యాయి. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు, వేడి గాలుల కారణంగా ఒంటిపూట బడులను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 17 వరకూ ఒంటిపూట బడులను కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
అయితే ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఒంటిపూట బడుల తేదీని పొడిగించింది. దాదాపు 300 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. 23 మండలాల్లో అయితే మరీ ఎక్కువ తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఈ నెల 17 వరకూ ఒంటిపూట బడులను కొనసాగించాలని నిర్ణయించినప్పటికీ.. ఎండ తీవ్రత తగ్గని కారణంగా పొడిగించాలని నిర్ణయించుకుంది. జూన్ 24వ తేదీ వరకూ ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యా కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకూడదని.. వడగాల్పులను దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులను మరో వారం రోజుల పాటు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 24వ తేదీ వరకూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు మునుపటిలానే ఉదయం 7:30 నుండి 11:30 వరకూ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 8:30 నుంచి 9:00 వరకూ రాగి జావ, మధ్యాహ్నం 11:30 నుండి 12:00 వరకూ మధ్యాహ్న భోజనం పెట్టాలని విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు.