సంక్షేమ పథకాల అమలుతో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. పథకాల ద్వారా అందించే మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తూ.. సద్వినియోగం అయ్యేలా చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
వినూత్న సంక్షేమ పథకాలతో అమలుతో పేదలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అప్పుడే పుట్టిన చిన్నారులు మొదలు.. వృద్ధులు వరకు ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు తీసుకువచ్చారు సీఎం జగన్. ఏపీలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. పైగా ఈ పథకాల ద్వారా అందించే నగదును డైరెక్ట్‌గా లబ్ధిదారుల అకౌంట్‌లో జమ చేస్తూ.. ప్రభుత్వ సాయం సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే విద్యార్థులకు అందించే సాయాన్ని వారి తల్లుల ఖాతాలో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట తల్లుల ఖాతాలో లక్ష రూపాయలు జమ చేయనుంది. మరి ఈ మొత్తం ఏ పథకానికి సంబంధించింది అంటే..
పేదింటి ఆడపిల్ల వివాహం.. ఆమె తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో జగన్ సర్కార్ లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే. కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల ద్వారా ఈ మొత్తాన్ని అందిస్తోంది. దీని ద్వారా అందించే మొత్తాన్ని పెళ్లి కుమార్తె ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ పథకం కింద అందించే మొత్తాన్ని ఇక మీదట పెళ్లి కుమార్తె తల్లి ఖాతాలో జమ చేయనున్నారు. ఈ విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ తల్లి మరణిస్తే పెళ్లి కుమార్తె నిర్ణయం మేరకు ఆమె తండ్రి, అన్నదమ్ములు, గార్డియన్‌గా వ్యవహరించే వారి అకౌంట్‌లలో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ మేరకు పథకాల మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు.
అయితే కులాంతర వివాహాలు చేసుకున్న వారికి అందించే మొత్తాన్ని.. మాత్రం వధువు ఖాతాలోనే జమ చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, మైనారిటీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50 వేలు ఇస్తారు. అంతేకాక దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు రూ.40 వేల ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకాలకు అర్హులైన గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. వధువుకు 18 ఏళ్లు, వరుడుకి 21 ఏళ్లు వయస్సు కచ్చితంగా నిండి ఉండాలి. అంతేకాక ఇద్దరు పదో తరగతి పాస్ అవ్వాల్సిందే. చదువును ప్రోత్సహించడంతో పాటూ బాల్య వివాహాలను అరికట్టడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి పెళ్లికి మాత్రమే ఈ సాయం అందుతుంది. అయితే భర్త చనిపోతే.. వితంతువుకు మాత్రం రెండో వివాహం చేసుకున్న సందర్భంలో కూడా ఈ సాయం అందించేలా మినహాయింపు ఇచ్చారు. మరి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.