ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం కొన్ని వేలమంది రైతులకు మేలు చేకూరుస్తుందని చెబుతున్నారు. కృష్ణా, గోదావరి డెల్టా పరివాహక ప్రాంతాల్లో ఊన్న ఏ, బీ కేటగిరీ భూములకు డీ పట్టాలను, సీ కేటగిరీ భూములను ఐదేళ్ల లీజుకు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఈ మేరకు జీవో జారీ చేశారు. ఈ నిర్ణయం ద్వారా కొన్ని వేల మంది రైతులకు మంచి జరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కొన్నేళ్ల నుంచి ఒండ్రు మట్టి మేటలు వేసిన విషయం తెలిసిందే. అలా లంక భూములు ఏర్పడ్డాయి. అవి కాలక్రమేణా సారవంతంగా మారడంతో రైతులు కొందరు వాటిని సాగు చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి భూములకు పట్టాలు ఉండవు. వీటిని ఏ, బీ, సీ కేటగిరీలుగా పిలుస్తారు. గట్టుకు దగ్గరగా ఉండి వరద వచ్చినా మునిగి పోని భూమిని ఏ అని, ఏకి ఆనుకుని, కొంత నదిలో ఉన్న భూమిని బీ అని.. నదిలో ఉండి వరద వచ్చి కొట్టుకుపోయే భూములను సీ అని పిలుస్తారు.
గతంలో ఓసారి ఏ, బీ కేటగిరీ భూములకు డీ పట్టాలు జారీ చేశారు. సీ కేటగిరీ భూములను ఏడాదిపాటు లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏ, బీ కేటగిరీ భూములకు డీ పట్టాలు ఇస్తూ.. సీ కేటగిరీ భూములను ఐదేళ్లపాటు లీజుకు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అసైన్మెంట్ కమిటీల ఆమోదంతో పట్టాలను జారీ చేసే అధికారం కలెక్టర్లకు ఇచ్చారు. ఎంజాయ్ మెంట్ సర్వే నిర్వహించి అర్హులకు పట్టాలు ఇవ్వనున్నారు. అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వగా మిగిలిన భూమిలో 50శాతం ఎస్సీ, ఎస్టీ రైతులకు, మిగిలిన 50 శాతం భూమిలో 2/3వ వంతు బీసీల్లోని పేదలకు, మిగిలిన 1/3వ వంతు భూమిని నిరుపేద రైతులకు పంచివ్వాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దాదాపు 10 వేల మంది లంక భూముల రైతులకు మేలు జరుగుతుందని తెలుస్తోంది.