మణిపూర్ లో రిజర్వేషన్ల విషయంలో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. దాదాపు 54 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ముమ్మర చర్యలు ప్రారంభించాయి.
మణిపూర్ లో రిజర్వేషన్ విషయంలో అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. మైతై సామాజిక వర్గాన్ని ఎస్టీ లిస్టులో చేర్చడాన్ని నిరసిస్తూ అల్లర్లు చెలరేగాయి. మైతై- కుకీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఒక్క ఇంఫాల్ లోనే 23 మంది చనిపోయినట్లు తెలిపారు. అల్లర్లలో మృతుల సంఖ్య 54కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు చెబుతున్నారు. కానీ, మళ్లీ అల్లర్లు చెలరేగవని చెప్పలేం. అందుకే అక్కడ ఉంటున్న ఇతర రాష్ట్రాల వాళ్లు స్వగ్రామాలకు వెళ్లిపోవాలి అనుకుంటున్నారు.
కానీ, అల్లర్ల కారణంగా అది సాధ్యపడేలా లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మణిపూర్ లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విమానం ద్వారా తెలుగు వారిని రాష్ట్రానికి తరలిస్తామంటూ ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం కూడా ముమ్మర చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేంద్రం, విమానయాన శాఖతో ఏపీ అధికారులు చర్చలు జరిపారు. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసేందుకు ఏవియేషన్ శాఖ అంగీకరించింది.
ఏ క్షణంలో అయినా ప్రత్యేక విమానం ద్వారా ఏపీ విద్యార్థులను మణిపూర్ నుంచి రాష్ట్రానికి తీసుకొస్తారు. మణిపూర్ లో మొత్తం 100 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. అందరినీ క్షేమంగా సొంతూళ్లకు చేర్చేందుకు ఏపీ అధికారులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. అల్లర్లకు సంబంధించి మణిపూర్ ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపింది. దుకాణాలు తెరుచుకున్నాయి, వాహనాలు కూడా రోడ్డెక్కాయని వెల్లడించింది. ఇంఫాల్ వ్యాలీలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించినట్లు తెలిపారు. అల్లర్ల నుంచి 13 వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.