ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. తాజాగా ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ సర్కార్ పలు సంక్షేమ పథకాలతో పాటు.. ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచిస్తోంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వల్ల జనాలకు ఎలాంటి సేవలు లభిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో జగన్ సర్కార్ సోమవారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ.. శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఉద్యోగులకు మరో శుభావార్త చెప్పింది జగన్ సర్కార్. ఆవివరాలు..
ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవి కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలాన్ని ఏడాది లేదా ఆ పోస్టుల్లో శాశ్వత ఉద్యోగులను నియమించే వరకు ఏది ముందు అయితే అంత వరకు వీరి ఒప్పందం పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వశాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.. కేవలం వారి కాంట్రాక్టు మాత్రమే పొడిగిస్తున్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి తెలిపారు. పాఠశాల, ఉన్నత విద్య, న్యాయవిభాగం, టెక్నికల్ విద్య, వైద్యం, కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ, యువజన సర్వీసులు, టూరిజం శాఖలతో పాటుగా.. మరో 11 ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవి కాలాన్ని.. 2024 మార్చి 31 వరకు పదవీకాలాన్ని పొడిగించారు.
ఇదిలా ఉంటే.. ఈ నెల 19న షబ్-ఎ-ఖదర్ పర్వదినం సందర్భంగా ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023లో సెలవు దినాలకు సంబంధించి ప్రభుత్వం ఇది వరకు జారీ చేసిన జాబితాలో ఈ నెల 18న ఆప్షనల్ హాలిడేగా పేర్కొన్నారు. అయితే 18 మంగళవారానికి బదులుగా బుధవారాన్ని సెలవుగా ప్రకటించింది ప్రభుత్వం. ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి తెలిపారు. ఇక ప్రభుత్వ నిర్ణయంపై కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్ సర్కార్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.