టెక్నాలజీ పెరిగిన తర్వాత సినిమా థియేటర్ల దగ్గర సందడి తగ్గిపోయిందనే చెప్పాలి. గతంలో అయితే తమ అభిమాన హీరో సినిమా కోసం తెల్లవారక ముందే థియేటర్ల దగ్గర పడిగాపులు కాయడం. టికెట్ల కోసం చొక్కాలు చించుకోవడం వంటి పరిస్థితుల నుంచి ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకుని చొక్కా ఇస్త్రీ నలగకుండా సినిమా చూసొచ్చే దాకా పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఆ తరహాలో టికెట్లు బుక్ చేసుకునేందుకు ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ధరల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు వెబ్‌సైట్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ తరహాలోనే పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
‘‘సినిమా థియేటర్లలో టికెట్లు విక్రయించే విధానాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ అంశాలను ఏపీ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. దీనికి సంబంధించిన విధానాలు, అమలు ప్రక్రియను కమిటీ చూసుకుంటుంది’’ అని జీవోలో వెల్లడించారు. కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. నిబంధనలు పాటిస్తూ సినిమాలు చిత్రీకరిస్తున్నారు. చిన్న సినిమాలైతే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. కానీ, భారీ ప్రాజెక్టు సినిమాలకు ఆ అవకాశం లేదు. ఏపీలో సినిమా థియేటర్లు పూర్తి సామర్థ్యంతో నడవట్లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు చిత్రాల ప్రదర్శనలు జరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణలో థియేటర్లు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. ఏదో రకంగా నిర్మాతలు, సినిమా థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం నష్టాలు తప్పడం లేదు.